
భూములు చూపకపోతే ఆత్మహత్యలే శరణ్యం
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - మిడుతూరు
మిడుతూరు మండల కేంద్రంలో 40 దళిత కుటుంబాలకు, 6 బిసి కుటుంబాలకు 1996లో అలగనూరు గ్రామ పొలిమేరలో పట్టాలు, పాసు బుక్కులు ఇచ్చారని, ఇంతవరకు భూములు చూపలేదని, తక్షణమే భూములు చూపకపోతే లబ్ధిదారులకు ఆత్మహత్యలే శరణ్యమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు దళితులకు, బిసిలకు భూములు చూపాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యకాసం జిల్లా నాయకులు టి.ఓబులేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడుతూరు గ్రామానికి చెందిన ఎస్‌సి, బిసి 45 కుటుంబాలకు 1996లో అలగనూరు పొలిమేరలో పట్టా పాస్ పుస్తకాలు 596 ఖాతా నెంబరు మీద మంజూరయ్యాయని చెప్పారు. అయితే నాటి నుండి నేటి వరకు భూములు చూపలేదని తెలిపారు. భూములు చూపించాలని వ్యకాసం ఆధ్వర్యంలో రిలే దీక్షలు, అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్న దళితులపై వివక్ష చూపుతున్నారు తప్ప పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్ల కోసం వస్తారు తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలను కలెక్టర్, ఆర్డిఓ, నందికొట్కూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా ఈ రోజు రేపు అంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప పరిష్కరించడం లేదని చెప్పారు. తక్షణమే లబ్ధిదారులకు భూమి చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ ప్రకాష్ బాబు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి వివరాలు మొత్తం సేకరించి శనివారంలోపు కలెక్టర్‌కి పంపిస్తానని హామీ ఇవ్వడంతో రిలే దీక్ష విరమించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి భూములు చూపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పకీర్ సాహెబ్, సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ, రైతులు సుజ్ఞానం, తిరుపతయ్య, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, రాముడు, జయరాముడు, ఏసన్న, దీక్షలో కూర్చున్న వారు మహిళలు, దేవమ్మ, వెంకటమ్మ, లక్ష్మీదేవి, మద్దమ్మ, తదితరులు పాల్గొన్నారు.