భూములు చూపకపోతే ఆందోళన ఉధృతం
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - ఆత్మకూరు
మిడుతూరు మండల కేంద్రంలోని 46 దళిత, బిసి కుటుంబాలకు అలుగునూరు పొలిమేరలో 1996లో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలకు భూములు వెంటనే చూపాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరావు అధికారులను హెచ్చరించారు. బుధవారం మిడుతూరులోని తహశీల్దార్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బిసిలు, దళితులు చేపటిటన రిలే నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. ఈ దీక్షలకు వ్యకాసం మండల అధ్యక్షుడు టి.ఓబులేసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలుగునూరు పొలిమేరలో 1996లో దళితులకు, బిసిలకు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలపై క్రాప్ లోన్ పంట రుణాలు కూడా తెచ్చుకున్నారని, సబ్సిడీ ద్వారా ఎరువులు, విత్తనాలు కూడా ఇస్తున్నారని తెలిపారు. పట్టా పాస్ పుస్తకాలకు భూములు చూపించాలని గత 27 సంవత్సరాలుగా అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా మాయమాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప చూపడం లేదన్నారు. అధికారులు కాలయాపన చేస్తే ఆందోళన తీవ్రతం చేస్తామని, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. గత పాలకులు దళితుల ఓట్ల కోసం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి భూములు చూపకపోవడం అన్యాయమని అన్నారు. రెవెన్యూ అధికారులు సర్వే పేరుతో సంవత్సరాల తరబడి కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే భూములు చూపాలని డిమాండ్ చేశారు. రెండో రోజు దీక్షలో జయలక్ష్మి, లింగమ్మ, రాణమ్మ తదితరులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.ఫకీర్ సాహెబ్, స్థానికులు సుజ్ఞానం, తిరుపతయ్య, జయరాముడు, సురేష్, సుంకన్న, రవణమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.










