ప్రజాశక్తి - వినుకొండ : మండలంలోని బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధి జాలలపాలెం వద్ద ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచే వరకు పోరాడతామని వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ప్రకటించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించగా టిడిపి జనసేన, బిఎస్‌పి, ఎంఐఎం, పిడిఎం, ఎంఆర్‌పిఎస్, మాల మహానాడు, సిపిఐ, ఏపీ గిరిజన సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భగా ఆయా సంఘాలు, పార్టీలు జెఎసిగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 175 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసిన కె.వెంకటేశ్వర్లుకు భద్రత కల్పించాలని, దీనిపై ఐజికి విన్నవిస్తామని చెప్పారు. జాలలపాలెం భూ ఆక్రమణలపై జిల్లా అధికారులకు, ఎమ్మెల్యేకు హైకోర్టు నుండి నోటీసులు వస్తే ఎమ్మెల్యే తప్పుడు ప్రకటనలు చేయడం సరి కాదన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా చూపుతున్న అధికారులు స్పందించడం లేదన్నారు. సమావేశంలో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఎన్.రాజు, ఎన్.శ్రీనివాసరావు, పివి. సురేష్ బాబు, ఆర్‌కె.నాయుడు, బి.శ్రీను, ఆర్.ప్రస న్నకుమార్, చిదంబరం, కోటా నాయక్, పి.నాగమల్లేశ్వరరావు, మస్తాన్‌వలి, విజరు, జి.ఏసురత్నం, జాన్‌పాల్ పాల్గొన్నారు.










