ప్రజాశక్తి - వినుకొండ : ప్రభుత్వ భూములను అప్పనంగా మింగేస్తున్న తిమింగలం వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి రెవిన్యూ జాలలపాలెం వద్ద 175 ఎకరాల అడవి, కుంట, చెరువు, ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించారని, ముల్పూరి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వద్దనుండి మొత్తముగా భూములు కొనడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.బుల్బురి ఆగ్రో టెక్నాకు ఎమ్మెల్యే బినామీ అని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఆర్ దాఖల ప్రభుత్వ భూములు ఉన్నట్లుగా 175 ఎకరాల ప్రభుత్వ భూమి సమగ్ర వివరాలను లోకాయుక్తకు వినుకొండ తహశీల్దార్ సమర్పించారని అన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లిన వ్యక్తిని ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని, అతనికి ఏం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యతని అన్నారు. వేల ట్రక్కుల గ్రావెల్ మట్టిని ఆవుల ఫారానికి అక్రమంగా తోలుకొని రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణపల్లి వద్ద చౌకగా భూములను కొనుక్కున్న ఎమ్మెల్యే అనధికారికంగా ప్రజాధనంతో బైపాస్ రోడ్డు పేరుతో రోడ్డు వేసుకోవడం, వినుకొండ కొండ చుట్టూ భూములు కొనుక్కొని మునిసిపల్ నిధులతో చుట్టూ గిరి ప్రదర్శన రోడ్డు ఇలా తానుకున్న భూములకు విలువ పెంచుకునేందుకు ప్రజాధనంతో రోడ్లు వేయించుకుంటున్నాడని దుయ్యబట్టారు. మార్కాపురం రోడ్డు నేషనల్ హైవే పక్కనే ఎమ్మెల్యే కొనుగోలు చేసిన 100 ఎకరాల్లో 62 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూములతో పాటు ఏబీఎమ్ ఆస్తులను కూడా మింగేసిన ఘనుడు బ్రహ్మనాయుడు అని, ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పలపాడు, తెల్లపాడు ఎక్కడ తాము కొనుగోలు చేసినా ఆ భూములు పక్కాగా పట్టా భూములని, అధికారులను ఒత్తిడి చేసి అక్రమంగా వ్యవహరిస్తే చట్టబద్ధంగా వెళ్తామని అన్నారు.
విమర్శలకు ఎమ్మెల్యే ఖండన
ఇదిలా ఉండగా జీవీ ఆంజనేయులు ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఈ మేరకు స్థానిక వైసిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తన వద్ద సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి లేదని, ఉందని నిరూపిస్తే యావదాస్తి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. టిడిపి హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, వాటిపై విచారణ జరిగిందని చెప్పారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఒప్పుకొండ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ చేస్తున్నారని, జీవి గెస్ట్ హౌస్ ఎన్‌ఎస్పీ పంట కాల్వపై నిర్మించారని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.










