Sep 26,2023 20:54

భూముల రీసర్వే పుర్తయ్యేదెన్నడో?

 రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రక్రియ 2021 సంవత్సరంలో ప్రారంభించారు. జిల్లాలల్లో మాత్రం నత్త నడకనసాగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని 470 రెవెన్యూ గ్రామాలుండగా 391 గ్రామాలలో డ్రోన్‌ సర్వే పూర్తి చేశారు.15,86,129 ఎకరాలు ఉండగా ఇప్పటివరకు 22,635 ఎకరాలలో రీ సర్వే 127 గ్రామాలలో మాత్రమే పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాలు, 470 రెవెన్యూ గ్రామాల్లో 38 మంది సర్వేయర్లు, 400 మంది విలేజ్‌ సర్వేర్లు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రీ సర్వే పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మిగిలిన 363 గ్రామాల్లో, 1,563,494 ఎకరాలలో రీ సర్వే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. మిగిలిన రీ సర్వేను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్వే నిర్వహించాల్సిన గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను ప్యూరిఫికేషన్‌ (స్వచ్ఛీకరణ) పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తవ్వడంతో ఆరోరిపై ఇమేజ్‌ (ఒఆర్‌) లు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. ఆయా గ్రామల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ (భూ యజమాని డాక్యుమెంట్ల పరిశీలన), గ్రౌండ్‌ వాలిడేషన్‌ (భూమి విస్తీర్ణం నిర్ధారణ) ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలనకు మండల తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దార్లను నియమించారు. మొత్తం ప్రక్రియను తహశీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు. నిర్ణీత భూముల హద్దుల్లో తేడా లేకుండా ఉండేందుకు రీ సర్వేకు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. పలు ప్రాంతాల్లో భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల వద్ద అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పలువురు రైతులకు సంబంధించిన పాస్‌ బుక్‌లో తప్పులు, లోపాల సవరణకు వందల మంది రైతులు జిల్లా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో 107 గ్రామాలలో మాత్రమే సర్వే చేయడానికి ఇంత సమయం పట్టింది. మిగిలిన గ్రామాలు పూర్తి కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాల్సిందే.
రైతుల సమక్షంలో రీసర్వే నిర్వహించాలి
కొన్ని గ్రామాలలో నాయకులకు ఉపయోగపడే గ్రామాలను ఎంపిక చేసుకొని రీ సర్వే చేస్తున్నారు. రీ సర్వే చేసిన మిగులు భూములను నాయకుల కబ్జా చేసుకుంటున్నారు .దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. కొన్ని గ్రామాలలో డ్రోన్‌ ద్వారా సర్వే చేస్తున్నారు. రీ సర్వే చేసేటప్పుడు చుట్టుపక్కల రైతులను సమక్షంలో రైతులకు హద్దులు చూపించి రీ సర్వే చేయాలి.
- సి.రామచంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, రాయచోటి.
డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత రెండో విడత ఈ సర్వే పూర్తి చేశారు. మూడు విడతలు ఈ మధ్యకాలంలోనే ప్రారంభించాం. ఈ సర్వే పై జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వారానికి రెండుసార్లు సమీక్షిస్తున్నారు. వారి సహకారంతో డిసెంబర్‌ 23 నాటికి వంద శాతం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు.
- టి.జయరాజ్‌, జిల్లా భూ రికార్డుల సర్వే శాఖ సహాయ సంచాలకులు, రాయచోటి.