ప్రజాశక్తి -రావికమతం: భూ రీ సర్వే పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. గుమ్మలపాడు గ్రామంలో గురువారం పర్యటించిన ఆమె గ్రామస్తులతో మాట్లాడుతూ, పూర్తిస్థాయిలో 100 శాతం రీ సర్వే చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో 141 గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించినప్పటికీ కొన్ని గ్రామాల్లో మాత్రమే 100శాతం భూ సర్వే పూర్తి అయిందన్నారు. రెండవ విడతగా 247 గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించామని తెలిపారు. మార్చిలో 100శాతం పూర్తయిన గ్రామాల భూముల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యలు, అభ్యంతరాలు ఉంటే నేరుగా జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో తెలియజేయాలని కోరారు. అంగన్వాడి కేంద్రంలో మెనూ పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలలో పిల్లలకు తయారు చేసే వంటశాల పరిశుభ్రంగా ఉంచుకొని, మెనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.










