ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో చేపడుతున్న భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని ఆర్డీవో జయరాం ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలో జరుగుతున్న రీ సర్వే గ్రామాలను సందర్శించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీ సర్వే పట్ల సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని 140 గ్రామాల్లో ప్రస్తుతం 33 గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా అసైన్డ్ భూములు, రికార్డుల మార్పునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో 3 ఎకరాల భూ పంపిణీకి చర్యలు చేపట్టనున్నామని, ఇందు నిమిత్తం సబ్ డివిజన్లో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు జానకమ్మ, డిప్యూటీ తహసిల్దారు సోమశేఖర్ పాల్గొన్నారు.










