ప్రజాశక్తి-పాడేరు టౌన్: భూ హక్కు పత్రాలు పంపిణీకి భూముల రీ సర్వే వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ తహశీల్దారులు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లతో భూముల రీసర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముసాయిదా భూముల రిజిష్టరు పూర్తి చేసి 13 నోటిఫికేషన్ జారీ చేయలని సూచించారు. రీ సర్వే, వెక్టరైజేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియలకు లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ దిశగా పనులు గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. జిల్లా వ్యాప్తంగా 2676 గ్రామాలకు సర్వే చేయడానికి లక్ష్యాలను నిర్దేశించగా ఇప్పటి వరకు 637 గ్రామాలలో 2 లక్షల 56 వేల 488 ఎకరాల భూములను సర్వే పూర్తి చేసారని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే వేగంగా పూర్తి చేసి గ్రామ సర్వేయర్లు డేటా ఎంట్రీ, విఆర్‌ఒలు డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూముల క్లాసిఫికేషన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మ్యుటేషన్ ప్రక్రియలు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు వై.మోహనరావు, సర్వే ఇన్స్పెక్టర్ ఎస్.నాగేశ్వరరావు, 11 మండలాల తహశీల్దారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.










