ప్రజాశక్తి - రంపచోడవరం
భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. భూహక్కు భూరక్ష ప్రోగ్రామ్‌పై స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేర్లు, సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్‌తో సోమవారం రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్‌తో కలిసి పిఒ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొంతమంది తహశీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఒ సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లోని సుమారు 539 గ్రామాలకు గాను ఇప్పటివరకు 98 గ్రామాలలో భూముల రీ సర్వే చేయడం జరిగిందని తెలిపారు. సర్వే టీంలు ప్రతిరోజు సకాలంలో ఆయా గ్రామాలలో అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. సర్వే చేసిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని ఒక్కొక్క మండలంలో ఎన్ని సర్వే టీంలు, ఎన్ని డీజీపీ మిషన్లో పనిచేస్తున్నాయో, ప్రతిరోజు ఒక్కొక్క మండలంలో ఎన్ని ఎకరాలు రీసర్వే చేస్తున్నారో మండలాల వారిగా ఆరా తీశారు. వచ్చే జూన్ చివరి నాటికి ఈ రీ సర్వేలన్నీ పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ భూములకు సంబంధించిన బౌండరీల సమస్యలు ఉంటే ఈ విధంగా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ అన్ని మండలాల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ సర్వే చేయాలన్నారు. అన్ని ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములకు రీసర్వే చేయడానికి ఆయా గ్రామాలలో ముందుగా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. టార్గెట్ ప్రకారం సర్వే చేయుటకు సర్వే టీంలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే కె.దేవేంద్రుడు, తహశీల్దార్లు సిహెచ్.శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, పి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్, నాగభూషణం, రాజశేఖర్, డిప్యూటీ తహశీల్దారు రామకృష్ణ, సర్వేయర్లు పాల్గొన్నారు.










