Jul 17,2023 22:34

సమావేశమైన భూపోరాట కమిటీ

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : హైకోర్టు తీర్పు తీర్పు మేరకు గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలోని 300 ఎకరాల ప్రభుత్వ భూమికి లబ్ధిదారులైన దళితులకు వెంటనే పట్టాలిచ్చి భూమి స్వాధీన పరచాలని చర్లగుడిపాడు భూపోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై 3 నెలలుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, ఇప్పటికైనా న్యాయం చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించింది. కమిటీ సమావేశం చర్లగుడిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. సమావేశానికి కమిటీ కన్వీనర్‌ పి.ఆదాం అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 వేల ఎకరాలను పేదలకు పంచుతానని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, అసైన్మెంట్‌ భూములకు పూర్తిస్థాయి హక్కులు ఇస్తామని, రీ సర్వే సందర్భంగా పేదల స్వాధీనంలో ఉన్న భూములకు అన్ని హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నదని అన్నారు. అయితే అనేక చోట్ల పేదలు తమ స్వాధీనంలో ఉన్న భూములకు హక్కులు కావాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆదాం మాట్లాడుతూ చర్లగుడిపాడులోని 300 ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేస్తుంటే జంగమేశ్వరపురంలోని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారు తమపై దౌర్జన్యం చేసి, తప్పుడు కేసులు పెట్టి, భూములు ఆక్రమించాలని చూస్తున్నారని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, తమపై పెట్టిన ట్రెస్‌పాస్‌ కేసును గురజాల కోర్టు కొట్టి వేసిందని వివరించారు. ఆ భూములతో విశ్వవిద్యాలయం వారికి సంబంధం లేకున్నా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఈ విషయంలో న్యాయం కోసం హైకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుండి 3 నెలలుగా కలెక్టర్‌, ఆర్డీవో, తహశీల్దార్‌ తదితర రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన బెలిబుచ్చారు. విశ్వవిద్యాలయం వారితో మాట్లాడుతామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తమ గ్రామానికి మంగళవారం రానున్న నేపథ్యంలో వారి దృష్టికీ ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకుంటే భూముల్లో ప్రత్యక్ష కార్యక్రమం పూనుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సమావేశంలో భూ పోరాట కమిటీ సభ్యులు కె.అక్కులు, బి.సువర్ణబాబు, కె.ఎలమంద, పి.మరియదాసు, పి.బంగారమ్మ, పి.దానమ్మ, పి.వజ్రం, పి.రాణమ్మ, పి.కోటేశ్వరరావు, పి.చిన్నబాబు పాల్గొన్నారు.