Aug 20,2023 00:14

భూమన కరుణాకర్‌రెడ్డి చొరవతో...
సుదీర్ఘ సమస్యకు 'చెక్‌'
22(ఏ) భూములకు పరిష్కారం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుపతిలోని స్థలాల రిజిస్ట్రేషన్‌ నిలుపుదలకు ఉద్దేశించిన సెక్షన్‌ 22(ఎ)ను తిరుపతి ఎంఎల్‌ఎ హోదాలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించిన అంశం మరోసారి శనివారం చర్చకు వచ్చింది. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఉదయం తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష జరిగింది. టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి నగర డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డిలు ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం సమగ్ర వివరణ ఇచ్చింది.
అసలు సమస్య ఇదే..
సెక్షన్‌ 22 (ఏ) కింద పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగర పాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్‌ రెడ్డి కాలని, ఎరుకల కాలని, జర్నలిస్ట్‌ కాలని ( ఎఱ్ఱమిట్ట), కసంగడ్డ- కెనడి నగర్‌, భగత్‌ సింగ్‌ కాలని ( ఓబులేసు కాలని), సుందరయ్య నగర్‌, శారది నగర్‌, సూరయ్య కట్ట, చెన్నారెడ్డి కాలనీ, సంజీవయ్య నగర్‌, సింగాల గుంట, నరసింహ తీర్థం రోడ్డు, తాతయ్య గుంట, బొమ్మగుంట ప్రాంతాలకు సంబంధించిన స్థలాల రిజిస్ట్రేషన్లు కాకుండా నిలుపుదల చేసింది. దీంతో తిరుపతిలో ఐదు వేల నివాస గహాల వరకు క్రయ విక్రయాలకు ఎలాంటి హక్కులు ఉండవు.
ఈ సమస్యపై రెవెన్యూ శాఖ వివరణ
గతంలో జీవో ఎం.ఎస్‌ నెం. 232ను 2004, మార్చి 4న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రభావం తిరుపతి అర్బన్‌ పరిధిలోని 17 ప్రాంతాల్లో 104 ఎకరాల పరిధిలో ఐదువేల నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాజాగా వీటిని నిషేధిత సెక్షన్‌ 22(ఎ) కింద నుంచి తొలగిస్తూ ఆర్‌ఓసీ 283/2923 తేదీ 16/08/2023 ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి పంపడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.