ప్రజాశక్తి - ఏలూరు టౌన్
జీవనాధారమైన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని నగర కమిషనర్ షేక్ షాహిద్ అన్నారు. స్థానిక సెయింట్ థెరీసా కాలేజీలో శనివారం నిషేధిత ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇళ్లలో ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల జీవరాశులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జులై ఒకటో తేదీ నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిందన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీల్లో, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల పర్యావరణం కలుషితమై, నీటి కాలుష్యంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోగాలు బారినపడే అవకాశం ఉందన్నారు. భూమి రక్షణకు స్వచ్ఛమైన గాలి, నీరు, పర్యావరణ పరిరక్షణకు సామాజిక బాధ్యతగా విద్యార్థులు కృషి చేయాన్నారు. గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరపాలక సంస్థ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు.. ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కమిషనర్ తెలిపారు. అనంతరం నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాల ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి కమిషనర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థినులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌ఆర్.మెర్సి, గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మనోహరి, హెల్త్ అధికారులు డాక్టర్ మాలతి, డాక్టర్ గోపాల్ నాయక్, సిస్టర్ స్టెల్లా, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










