Jan 22,2023 23:32

నిరసన చేపడుతున్న బాధితులు

ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భూకజ్జాల పర్వం ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో స్థానిక రెవిన్యూ అధికారులే నోలేల్ల బెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.గత పది రోజుల కిందట ఇదే మండలంలో తట్టబంద శివారు పొర్లు పాలెం గ్రామ శ్మశాన వాటిక కబ్జా చేయడంతో పాటు కొండ గెడ్డలు, వాగులు, గిరిజనుల భూములకు సాగు నీరు అందించే చెక్‌ డామ్‌ లు, ఢ ఫారం భూములు కలపి మరో 30 ఎకరాల భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కబ్జాకు పాల్పిడిందన్న ఆరోపణలు మరువక ముందే మరో కబ్జా పర్వం వెలుగు చూసింది. మండలంలో బాధనపాడు రెవెన్యూ పరిధిలో ఈ మధ్యనే కొత్తగా వేసిన మరో వెంచర్‌ పక్కన ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఎనిమిది ఎకరాల భూములను కబ్జాకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సంఘటనా స్థలంలోనే టెంట్‌ వేసి బాధిత కుటుంబం ఆదివారం నిరసన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు పిల్లా నూకరాజు, సర్వేశ్వరరావు తదితర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తాపే శ్వరంకు చెందిన తమ తండ్రి పిల్లా అచ్చారావు బాధన పాడు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 40 (ప్రస్తుతం సర్వే నెం 54 )లో సుమారు 24 ఎకరాలను తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం లింగరాజుపేటకు చెందిన దానబోయిన నాగరాజు నుంచి ( 10 ఎకరాలతో సహ )1967లో (డాక్‌ మెంట్‌ నెం 2527 ) కొనుగోలు చేసారని వివరించారు. పట్టా నెంబర్‌ 80గా 1996 లో నమోదు అయినప్పటి నుంచి తమ సాగులోనే ఉందన్నారు. పక్కనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు తమ భూములలో సుమారు 14 ఎకరాలను తామే విక్రయం చేశామని..మరో రెండు ఎకరాలు భూమిని మరో రైతుకు విక్రయించామని బాధితులు చెప్పారు. మిగిలిన ఎనిమిది ఎకరాల భూమి తమ తండ్రి అచ్చారావు పేరునే ఉందని, అయితే ఆ భూమిని కూడా తామే కొనుగోలు చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఎగ్రిమెంట్‌ ప్రకారం అందులో సుగంధ చెట్లు నాటారని కాలం గడుస్తున్న భూములు కొనుగోలు వ్యవహారం తీర్చ కుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కారించాలని స్థానిక తహసీల్దార్‌ దృష్టిలో పెట్టడం తో పాటు జిల్లా కలెక్టర్‌ స్పందనలో ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు. పలుకుబడి ఉపయోగించి తమ భూమిని కబ్జా చేసారని తమకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించకుండా తమ వద్ద ఉన్న భూమి రికార్డులు సరైనవి కావు అంటూ...భూములతో సంబంధం లేని రైతుల పేర్లు చూపించి కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల వద్దకు వస్తే చంపేస్తా మంటూ బెదిరిస్తూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలనీ కోరుతూ తమ భూముల వద్దనే కుటుంబంతో సహా వంటా వార్పు తో నిరసన చేపట్టి నట్టు బాధితులు నూకరాజు, సర్వేశ్వ ర రావు కుటుంబం స్పష్టం చేశారు. తగిన భద్రత కల్పించాలని రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సమస్య పై తహసీల్దార్‌ మహేశ్వరరావు ను వివరణ కోరగా...ఈ సివిల్‌ సమస్య పై ఇప్పటికే ఇరువ ర్గాలతో సమావేశం నిర్వహించామని, భూమి ఎలా ధఖలు పడిందో లింక్‌ డాక్‌ మెంట్‌ తీసుకు రావాలని ఇరు వర్గాలకు చెప్పామన్నారు. ఇంత వరకూ రాలేదని పేర్కొన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని తహసీల్దార్‌ మహేశ్వరరావు తెలిపారు.