Oct 24,2023 21:43

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి
భూతగాదాల కారణంగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బైరెడ్డిపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప (32) సోమవారం తన భూమిని కబ్జా చేసిన పలమనేరు సాయి గార్డెన్స్‌లో నివసిస్తున్న ఎ.కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి తన భూమి తనకు దక్కేలా చేయాలని ప్రాధేయపడ్డాడు. అయితే మధ్యవర్తి ఎ.నాగరాజ్‌ చరవాణి ద్వారా రెచ్చగొట్టడంతో రైతు చంద్రప్ప తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అతనికి భార్య మంజుల, కుమార్తె ధనుశ్రీ, కుమారుడు కుబేర్‌ ఉన్నారు. చంద్రప్ప కొన్నిరోజుల క్రితం తన కుటుంబ ఖర్చులకు మిట్టకురపల్లి గ్రామానికి చెందిన ఎ.కృష్ణమూర్తి వద్ద తన భూమిని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడు. బైరెడ్డిపల్లిలో హైవే రోడ్డు కారణంగా భూముల విలువ పెరగడంతో డబ్బులు తిరిగి చెల్లిస్తున్నా ఎ.కృష్ణమూర్తి తన భార్య కాంతమ్మ పేరుపై పాస్‌బుక్‌ చేసుకున్నాడు. ఈ విషయమై కొన్నిరోజులుగా రెవెన్యూ అధికారులకు చంద్రప్ప మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని భార్య మంజుల వాపోయింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మొరపెట్టుకుంది.