ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులకు సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు పంపుతున్నారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించిన ఒరిజినల్ డి ఫారం పట్టా, సదరు భూమి మీకు ఎలా సంక్రమించిందో తెలిపే ఒరిజినల్ దస్తావేజు, ఇతర పత్రాలను నోటీసు అందుకున్న వారం రోజుల్లోగా అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. సిఐడి విచారణ పేరుతో రెండేళ్లుగా కౌలు చెల్లించకుండా తాత్సారం చేసిన ప్రభుత్వం తాజాగా పత్రాలు చూపాలంటూ నోటీసులు ఇవ్వడంపై దళితులు, ఇతర పేద వర్గాలకు చెందిన అసైన్డ్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం అరెకరం, 30 సెంట్లు చొప్పున అసైన్డ్ భూములను పంపిణీ చేసింది. అసైన్డ్ రైతులు అత్యధికులు పూరిపాకల్లో నివాసం ఉండేవారు. దీంతో పత్రాలను భద్ర పరచడం ఇబ్బంది కరంగా ఉండేది. అగ్నిప్రమాదాలు, తుపానులు వంటివి సంభవించిన సందర్భంలో అవి కాలిపోవడం, పాడయి పోవడం జరిగిందని పేదలు చెబుతున్నారు.
గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి లాండ్ పూలింగ్ (భూ సమీకరణ) సందర్భంలో అసైన్డ్ భూముల విషయంలో ఎంజారుమెంట్ సర్వే చేయించింది. రెవెన్యూ, పంచాయతీ, సిఆర్‌డిఎ అధికారులు కొందరు స్థానికులను వెంట బెట్టుకొని నేరుగా అసైన్డ్ భూముల వద్దకు వెళ్లి సర్వే చేసి భూమి వివరాలను నమోదు చేశారు. సదరు వివరాల ఆధారంగా అసైన్డ్ రైతులు భూములను లాండ్ పూలింగ్‌లోని 9.14 అగ్రిమెంట్ ద్వారా రాజధాని నిర్మాణానికి సిఆర్‌డిఎకు స్వాధీనం చేశారు. దీంతో ప్రభుత్వం పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకూ కౌలు చెల్లించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రెండేళ్లు కౌలు చెల్లించింది. అయితే తాజాగా పత్రాలు సమర్పించాలని నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.
రాజధాని 29 గ్రామాల్లో మూడు వేల మంది అసైన్డ్ రైతులకు చెందిన సుమారు 4,500 ఎకరాల భూములకు సంబంధించిన కౌలు చెల్లింపులో కోత పెట్టాలనే దుర్బుద్ధితోనే ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసిందని అసైన్డ్ రైతులు మండిపడుతున్నారు. ఎంజారుమెంట్ సర్వే ప్రకారం అసైన్డ్ సాగుదారులను గుర్తించి గత ప్రభుత్వం ఐదేళ్లు, వైసిపి ప్రభుత్వం రెండేళ్లు కౌలు చెల్లించిన తరువాత ఇప్పుడు పత్రాలు ఏమిటని నిలదీస్తున్నారు. విచారణ పేరుతో జాప్యం చేయడంతో పాటు తాజాగా పత్రాలు సమర్పించాలని నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహానికి గురవుతున్నారు. కౌలు ఎగగొట్టడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రని తుళ్లూరుకు చెందిన అసైన్డ్ రైతులు మేరిగ నాగేశ్వరరావు, జొన్నకూటి ఏడుకొండలు విమర్శించారు.










