ప్రజాశక్తి - ఆదోని
భూకబ్జాలపై నిగ్గు తేల్చాలని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడో ఒక చోట భూకబ్జా జరిగిందని స్పందనలోనూ, బహిరంగంగా ఆదోనిలో బాధితులు బయటకొచ్చి ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు మంత్రి మండలి ఉప సంఘంతో విచారణ చేపట్టాలని కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజుల నుంచి భూకబ్జాల వివాదం ఆదోనిలో ఎక్కువ అవుతోందని తెలిపారు. ఎవరైనా అన్యాయానికి గురై ఉంటే తన వద్దకొస్తే న్యాయం చేస్తానని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేపైనా, వైసిపి నాయకులపైనా భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక మంత్రి మండలి ఉప సంఘం ఏర్పాటు చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మంత్రిమండలికి చట్టబద్ధత కలిగి ఉండాలని, భూకబ్జాలపై విచారణ కోసం కాలపరిమితి కూడా నిర్ణయించి విచారణ చేయించాలని తెలిపారు. ఈ విచారణ కూడా టిడిపి హయాం 2014 నుంచి వైసిపి ప్రభుత్వం 2023 వరకు పూర్తిస్థాయిలో చేయించాలని సూచించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి భూస్వామి అని, నిజాయితీపరుడని తనకు తెలుసని, అందరికీ తెలియాలంటే దీనిపై విచారణ అత్యంత అవసరమని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే భూకబ్జా విషయంపై తనకు అన్నీ తెలుసని, అందువల్లే మాట్లాడడం లేదని చెప్పారని, తనకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే తెలియదని అన్నారు. తాను ఒక రైతునని, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూకబ్జాలు తనకు తెలియని వారి వివాదంలో తనను లాగవద్దని స్పష్టం చేశారు. ఆదోని ప్రజలు ఈ భూకబ్జాల ఆరోపణలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఇక్కడ భూములు కొనాలన్నా భయపడుతున్నారని తెలిపారు. ఒకరు ఒక బాధితునికి రూ.1.60 లక్షలు ఇస్తామంటే, మరొకరు రూ.3 లక్షలు ఇస్తామని ముందుకొస్తున్నారని చెప్పారు. ఈ భూకబ్జాల విషయంలో ఏం జరుగుతుందన్న విషయంపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్రప్ప, మార్కెట్ యార్డు మాజీ వైస్ ఛైర్మన్ ఫక్రుద్దీన్, నాయకులు మల్లికార్జున, నారాయణపురం షేక్షావలీ, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తండ్రి, దేవుడెలా అవుతారు
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తండ్రి లాంటి వారని, దేవుడు లాంటివారని టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ కౌన్సిలర్ రామచంద్ర విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేను తనకు దేవుడు, తనకు తండ్రి అని చెప్పుకుంటే సరిపోతుందని, నియోజకవర్గ ప్రజలందరికీ చెబితే ఎలా అని ప్రశ్నించారు. తమ వ్యాపారాల కోసం ప్రజలందరినీ వాడుకోవడం తగదని సూచించారు. భూకబ్జా చేసిన వారిని పక్కన పెట్టుకుని ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. తాను అన్ని గుర్తుపెట్టుకుంటానని, సమయం వచ్చినప్పుడు చెబుతానని ఎమ్మెల్యే బెదిరించడం తగదన్నారు. స్పందనలో భూకబ్జా జరిగిందని ఫిర్యాదు చేసిన బాధితులను ముంబయికి పంపించారని తెలిపారు. భూకబ్జాల వల్ల ఆదోనిలో ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ జరగడం లేదని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పని లేక వెలవెలబోతుందని చెప్పారు.
సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్ రెడ్డి










