Oct 25,2023 21:39

భూగర్భ జలాల పెంపుకు పకడ్బందీ చర్యలు
కలెక్టర్‌ను కలసిన జలశక్తి అభియాన్‌ బృందం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
భూగర్భ జలాల పెంపుకుపై జలశక్తి బృందం సభ్యులు సచింద్ర కుమార్‌ పట్నాయక్‌, సోమరేంద్రో సింగ్‌లు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ను కలిసి చర్చించారు. ఈనెల 26, 27 తేదీల్లో జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్‌ పనులు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీరు సంరక్షణ, కుంటలు, చెరువులు పునరుద్ధరణ, ఫారం పాండ్‌, అమృత్‌ సరోవర్‌, ఫీడర్‌ ఛానల్‌ పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న పలు అభివద్ధి పనుల పురోగతిని కమిటీ సభ్యులకు వివరించారు. డ్వామా పీడీ గంగాభవాణి మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఈనెల 26వ తేదీన సదుం మండలం తాటిగుంటపాళ్యం, కంబంవారిపల్లి గ్రామ పంచాయతీల్లో, సోమల మండలంలో నడింపల్లి, ఇరికిపెంట, చౌడేపల్లి మండలంలో అమనిగుంట, నుంజార్లపల్లి, పరికిదొన, గడ్డంవారిపల్లి బంగారుపాళ్యం మండలంలో పాలేరు గ్రామ పంచాయతీలలో పర్యటిస్తారన్నారు. 27వ తేదీన తవణంపల్లి మండలంలో తవణంపల్లి గ్రామపంచాయతీ, ఐరాల మండలంలో చినకాంపల్లి, వడ్రాంపల్లి, వీరప్పరెడ్డిగారిచెరువు, మిట్టూరు, కామినేనివారిపల్లి గ్రామపంచాయతీల్లో, యాదమరి మండలంలోని బుడితిరెడ్డిపల్లి, కోనాపల్లి, పెనుమూరు మండలం ఎల్‌కేపి ఊరు గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి పనులను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని పీడీ వివరించారు. ఈ సమావేశంలో డ్వామా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.