ప్రజాశక్తి-విజయవాడ రూరల్: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా అమృత్ సరోవర్ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 36 చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందని, మే మాసాంతానికి మరో 35 చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవృత్ సరోవర్ పథకం ద్వారా నున్న వికాస్ కళాశాల రోడ్డులో 1.50 ఎకరాల విస్తీర్ణంలో చిలకలవాని చెరువు అభివృద్ధి పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచి రైతులకు పుష్కలంగా నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అజాదీ కా అమత్ సరోవర్ పథకం కింద జిల్లాలో 75 చెరువులను అభివద్ధి చేసేందుకు అనుమతులను మంజూరు చేయడం జరిగిందన్నారు.ఉపాధి హామి పథకం ద్వారా ఉపాధి కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నామన్నారు. 77 లక్షల పని దినాలు కల్పించాలన్న లక్ష్యంలో ఇప్పటికే దాదాపు 68 లక్షల పని దినాలను కల్పించామన్నారు. కూలీలకు ఉపాధి కల్పిచడంతో పాటు వారి కుటుంబ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. కూలీల పిల్లల్లో చదువుకున్న వారిని గుర్తించి వారికి ఆసక్తి గల రంగంపై శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సరాసరి రూ.257 దినసరి వేతనం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కూలీల మస్టర్ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేసి త్వరితగతిన వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ గమేళా బుట్టలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె.సునీత, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, గ్రాయ సర్పంచ్ కె.సరళ, ఉప సర్పంచ్ కె.బ్రహ్మానందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జి.టి వెంకటరమణ, పిఎసిఎస్ డైరెక్టర్ భీమవరపు ముత్తారెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు దాసరి కిరణ్‌కుమార్, గంపా శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్, యర్కారెడ్డి వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు అంగజాల హనుమా తదితరులు పాల్గొన్నారు.










