Nov 17,2023 20:49

నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, స్థానికులు

రాయచోటి టౌన్‌ : పట్టణంలో భూగర్భ డ్రెయినేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు అన్నారు. శుక్రవారం రోడ్‌పై మురుగు నీరు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించింది. కల్వర్టు ఎత్తు పెంచాలని చేస్తున్న ఆందోళనకు దుకాణాదారులు, వాహనదారులు స్వచ్చందంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయ చోటి బస్టాండ్‌ నుండి గాలివీడు రోడ్‌ మార్గాన న్యూ రాజేశ్వరి కేఫ్‌ ఎదుట ఉన్న కెనాల్‌ మురుగు నీటితో నిండి నిత్యం రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజానీకంతో పాటు వాహనదారులు, దుకాణదారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ కెనాల్‌కు మరమ్మతులు చేపట్టి శాశ్వతమైన పరిష్కారం చూపే విధంగా కమిషనర్‌ వైఖరిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. అండర్‌ డ్రెయినేజీని ఊరి బయట ప్రజలకు వసరం లేని చోట కాంట్రాక్టర్ల కాసులకోసం వేశారని, నాలుగేళ్లుగా నిత్యం జనరద్దీతో బస్టాండ్‌, హోటళ్లు, ఆసుపత్రులు సము దాయంలో ఉన్న చోట అండర్‌ డ్రెయినేజీ నిర్మించలేదన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే నెలలో నాలుగు నుండి ఆరు సార్లు డ్రైనేజీ దాటి రోడ్‌పై ప్రవహిస్తోందన్నారు. బురద రోడ్‌పైన ఉన్నప్పుడు బైక్‌ స్కిడ్‌ అయి గాయాలపాలైనా మున్సిపల్‌ సిబ్బందిలో కదలిక లేదన్నారు. పట్టణంలోని సుబ్బారెడ్డివీధిలో కుల్లాయి నీరు తీవ్ర దుర్వాసన రావడం వెనుక నీటి శుధ్ధి కేంద్రాల పైప్‌లైన్లలో వాటర్‌ బెడ్‌లు మార్చకపోడమేనన్నారు. కలుషిత నీటి వినియోగంతో ప్రజలు వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలవడానికి కమిషనర్‌ నిత్య పర్యవేక్షణ ప్రధాన తప్పిదమన్నారు. మున్సిపల్‌ సిబ్బంది తీరు మార్చుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాధవయ్య, దుకాణ, వాహనదారులు పాల్గొన్నారు.