ప్రజాశక్తి -మధురవాడ : ఐదోవార్డులో పారిశుధ్యం, డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ మొలి హేమలత తెలిపారు. శుక్రవారం వార్డు పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్పకాలనీ, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎమ్ కాలనీలలో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యుజిడి పైపులైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఎక్కడికక్కడే దుర్గంధ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆమె దృష్టికి తేగా, వెంటనే స్పందించి, సంబంధిత జివిఎంసి యుజిడి, శానిటేషన్ సిబ్బందిని అక్కడకు రప్పించి, యుద్ధప్రాతిపదికను యుజిడిలోని దుర్గంధం తొలగించే చర్యలు చేపట్టారు. సమస్య శాశ్వత పరిష్కారానికి జివిఎంసి కౌన్సిల్‌లో చర్చించడంతోపాటు జిల్లా కలెక్టర్, కమిషనర్, మేయర్ దృష్టికి తీసుకెళ్లి యుజిడి, మురుగుకాలువలు, కల్వర్టుల సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.










