Sep 30,2023 21:02

నల్లకండువాలు ధరించి, ప్లకార్డులతో సమావేశానికి హాజరైన టిడిపి కౌన్సిలర్లు

ప్రజాశక్తి-బొబ్బిలి :  మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసిపి కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ సమావేశ మందిరంలో శనివారం చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఒకటో వార్డు కౌన్సిలర్‌ చోడిగంజి రమేష్‌నాయుడు మాట్లాడుతూ బైరిసాగరం చెరువు ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే సరిహద్దులను గుర్తించాలని కోరారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు కావాలని అధికారులను కోరారు. పాతబొబ్బిలిలో గ్రామకంఠం భూమి ఆక్రమించి, అమ్మేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు అక్రమాలు, నకిలీ పట్టాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది చేస్తున్న అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. కౌన్సిలర్‌ ఇంటి గోవిందరావు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గొల్లపల్లికి చెందిన వైసిపి కౌన్సిలర్‌ సావు శారద మాట్లాడుతూ తన వార్డుకు నిధుల కేటాయింపులో వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని వార్డులతో సమానంగా నిధులు కేటాయించాలని కోరారు. కౌన్సిల్‌ సమావేశంలో వచ్చిన సమస్యలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లు, కో-అప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.
బర్తరఫ్‌ చేసే అధికారం కౌన్సిల్‌కు ఉందా?
మున్సిపల్‌ కో-ఆప్షన్‌ పదవి నుంచి బర్తరఫ్‌ చేసే అధికారం కౌన్సిల్‌కు ఉందా? అని మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు రియాజ్‌ ఖాన్‌ ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 7న కౌన్సిల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బర్తరఫ్‌ చేయడం అన్యాయన్నారు. ఏ నిబంధనల మేరకు తనను బర్తరఫ్‌ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనను బర్తరఫ్‌ చేస్తే కౌన్సిల్‌ సమావేశానికి అజెండా కాపీ ఎందుకు పంపించారని, బర్తరఫ్‌పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఖాన్‌ మాట్లాడుతుండగా సమా వేశాన్ని ముగిస్తున్నట్లు చైర్మన్‌ మురళీకృష్ణ ప్రకటిం చడంతో కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు.
టిడిపి కౌన్సిలర్లు వాకౌట్‌
సమావేశానికి టిడిపి కౌన్సిలర్లు ప్లకార్డులు పట్టుకుని, నల్ల దుస్తులు, కండువాలు ధరించి హాజరయ్యారు. టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్‌ చేశారు. సమావేశంలో కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌ మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేనప్పటికీ అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు.
ఇందిరమ్మ కాలనీలో
అక్రమాలపై వినతులు

ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం అధికారులను డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాలు అక్రమాలు, నకిలీ పట్టాలపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసిపి, టిడిపి కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు.