May 26,2023 19:17

మాట్లాడుతున్న కౌలు రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్‌

భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి : కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి - నంద్యాల

భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు నంద్యాల పట్టణంలోని టీ నరసింహయ్య భవనంలో కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌ మార్కు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 2011వ సంవత్సరంలో కౌలు తీసుకున్న కౌలుదారులకు కౌలు కార్డులు ఆయా గ్రామాలలో విఆర్‌ఓ, ఎంపీఈవోల ద్వారా గ్రామ సభలు పెట్టి ఇవ్వడం జరిగిందన్నారు. కౌలుదారులకు అన్ని బ్యాంకుల్లో పంట పెట్టుబడి కోసం పంట రుణాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం భూ యజమానితో అగ్రిమెంటు ఉంటేనే కౌలు కార్డు ఇవ్వాలని ఒక జీవో తెచ్చిపెట్టడం జరిగిందన్నారు. ఈ చట్టం వలన అనేకమంది కౌలు రైతులకు కౌలు కార్డులు అందడం లేదని పేర్కొన్నారు. భూ యజమానులు అగ్రిమెంటుపై సంతకం పెట్టడానికి అంగీకరించకపోవడంతో కౌలు కార్డులు అందక కౌలు రైతులు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, పిఎం కిసాన్‌, ఇన్సూరెన్స్‌, వివిధ పథకాలకు దూరమై నష్టపోతున్నారని అన్నారు. అందుకే 2019 సంవత్సరంలో చట్టాన్ని సవరించి కౌలుదారులు అందరికీ కౌలు కార్డులు ఇవ్వాలన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని కౌలు రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డి. సామన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.