ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి బుధవారం మండలంలోని చింతపాక గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులు, బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. అనంతరం స్థానిక నమ్మి వారి చెరువు వద్ద జరుగుచున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలందరికీ పని కల్పించడంలో అశ్రద్ధ వద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలను సందర్శించారు. గ్రామ సచివాలయం వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను పరిశీలించారు. జగనన్న రీ సర్వేపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రికార్డుల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్వేయర్ వినోద్ కుమార్, వీఆర్వో రమణపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. భూ సర్వే లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా రికార్డులు తయారు చేయాలని ఆదేశించారు.
వీధి దీపాలకు వినతి
విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ గోలజన శ్రీను కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చింతపాక జంక్షన్ నుండి గ్రామం సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని, చీకటి పడిన తరువాత వస్తున్న విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ 2 కిలోమీటర్ల దూరానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు అంబేద్కర్, మండల సర్వేయర్ సింహాచలం, హౌసింగ్ ఏఈ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.










