Dec 06,2022 00:04

సిబ్బందితో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌
ప్రజాశక్తి -అడ్డతీగల

భూ సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ అన్నారు. సోమవారం రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ సమస్యల కోసం ప్రజల నుండి 22 అర్జీలు అందించారు. స్థానికంగా ఉన్న పలు భూ సమస్యలపై ఫిర్యాదు చేసిన అర్జీదారుల వెంట సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ శ్రీనివాసరావుతో కూడిన రెవిన్యూ సిబ్బందికి సూచిస్తూ అర్జీదారులు ఆరోపించిన భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డుల ప్రకారం హక్కుదారులకు భూములను అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవాలన్నారు. మండలంలోని పులి గోగులపాడు పంచాయతీ పరిధిలో వివాదంలో ఉన్న 8.8 ఎకరాలకు సంబంధించి రికార్డు నివేదికలను ఐదు రోజుల్లో తమ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. స్థానిక గిరిజన యువకుడు చోళ కృష్ణారెడ్డి ఆరోపించిన మెయిన్‌ రోడ్‌లోని ఐఓబి బ్యాంక్‌ నిర్వహణ స్థలం, డి భీమవరం రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం రికార్డులను పరిశీలనకు సమర్పించాలని, ప్రభుత్వ పోరంబోకు స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం పక్క ఉన్న వివాదాస్పద స్థలంపై రెవెన్యూ రికార్డుల ప్రకారం హక్కుదారులను గుర్తించి అప్పగించాలని సూచించారు అడ్డతీగల ఏకలవ్య ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నూతన భవనాలు నిర్మాణంలో ఉన్న కారణంగా ప్రస్తుతం మారేడుమిల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న తమ పిల్లలు అసౌకర్యాల నడుమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు చెప్పారు. దీనికి స్పందించిన సబ్‌ కలెక్టర్‌ మారేడుమిల్లి వెళ్లి స్వయంగా పరిస్థితులు సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎంపీడీవో వెంకట్‌, సిడిపిఓ దీప్తి ,డిప్యూటీ తాసిల్దార్‌ తేజస్విని, వీఆర్వో బాలయ్య ,రెవిన్యూ ఇన్స్పెక్టర్‌ చిన్నబ్బాయి దొర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.