Oct 10,2023 23:06

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
కృష్ణాజిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఛాంబర్‌ లో గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడివాడకు చెందిన పలువురు రైతులతో జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంత రైతులకు చేసిన మేలును బట్టి కతజ్ఞతలు తెలిపారు. గుడివాడ బైపాస్‌ రోడ్డు ఎదురుగా ఉన్న షాదీ ఖానా సమీపంలోని 2 ఎకరాలు 3 సెంట్లు 2017 లో సర్వేల పేరుతో జమీందారీ భూమిక మార్చారని, తమ శాసనసభ్యులు కొడాలి నానికు తమ ఇబ్బందిని తెలియజేస్తే జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు ద్వారా 22/ఏ నుంచి తొలగించి మామూలు భూమిగా తమకు పట్టాలు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎస్‌. కె. షమ్ము, మహమ్మద్‌ ఇలియాస్‌, ఇద్రిస్‌, షేక్‌ ఇమామ్‌, మురారి నరసింహారావు, ఉమర్‌ బేగ్‌, కె. బ్రహ్మం, తోట వెంకటేశ్వరరావు తదితర రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ, కష్ణాజిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. బాపులపాడులో 400 ఎకరాల భూమిని వెయ్యి మంది రైతులకు పట్టాలుగా ఇచ్చామని, అలాగే మచిలీపట్నం సర్కార్‌ తోటలోని భూమిని పట్టాలుగా ఇచ్చినట్లు తెలిపారు. రైతులు భూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు. రైతులకు సందేహాలు ఉంటే అధికారులను నేరుగా సంప్రదించాలని ఆయన అన్నారు.