రాయచోటి : జిల్లాలోని ముదివేడు రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ అవార్డ్స్ వేగంగా పూర్తి చేయడంతోపాటు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ముదివేడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల అంశాలపై సంబంధిత తహశీల్దార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డిఒ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యు ఎస్, ఆర్‌అండ్‌బి, హౌసింగ్, విద్యుత్, సర్వే శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగునీరు సమస్యలు అధిగమించేందుకు చేపట్టిన ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా ముదివేడు రిజర్వాయర్‌కి సంబంధించి 1075 ఎకరాలు అవసరమన్నారు. ఇందులో 425 ఎకరాలు భూసేకరణ చేసి అవార్డు పాస్ చేశారని తెలిపారు. అవార్డ్స్ పాస్ చేసిన భూమికి సంబంధించి లబ్ధిదా రులకు త్వరగా పరిహారం పంపిణీ పూర్తి చేయాలన్నారు. మిగిలిన భూసేకరణకు ఆయా అంశాల వారీగా త్వరగా ప్రక్రియలను పూర్తి చేయా లన్నారు. తదుపరి వారంలోగా కురబలకోట, బి.కొత్తకోట మండలాల నుంచి అవార్డ్స్ పాస్ కొరకు ఫైల్స్ కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిగిలిన భూసేకరణలో ప్రభుత్వ, పట్టా భూమి, డికెటి, అసైన్మెంట్ భూముల వివరాలను ఆయా తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. పట్టా భూములకు సంబంధించి ఫామ్- సిలో నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, మదనపల్లి ఆర్‌డిఒ మురళి పాల్గొన్నారు.










