Nov 10,2023 00:16

ఆర్‌డిఒకు ఫిర్యాదు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి - వినుకొండ : మండలంలోని బ్రాహ్మణపల్లి వీఆర్వో నాగరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు నరసరావుపేట ఆర్డీవోకు గురువారం ఫిర్యాదు చేశారు. వీఆర్వో నాగరాజు ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారికి మద్దతుగా ఉంటూ, పట్టా భూముల రికార్డులను తారుమారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌ 68, 86 బి చెరువు పోరంబోకులో విఆర్‌ఒ నాగరాజు తన బంధువుల పేరుతో ఇళ్లు నిర్మించారని, రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఒకరి భూములను మరొకరి పేరుతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవడంతోపాటు భూముల యజమానులకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో పిడిఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్‌వలి, జై భీమ్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు గోదా జాన్‌పాల్‌, భారత్‌ బచావో జిల్లా అధ్యక్షులు కోటానాయక్‌ పాల్గొన్నారు.