Nov 10,2023 21:38

జాయింట్‌ కలెక్టర్‌కు వినతినిస్తున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి తదితరులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  ఇటీవల కాలంలో సమగ్ర భూ రీసర్వేలో అనేక లోపాలున్నాయని, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ యంత్రాంగం సరైన పద్ధతిని పాటించకపోవడమేనని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ భూ రీసర్వే సరైన పద్ధతిలో జరగకపోవడం వల్లనే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. భూ రీసర్వే నిర్వహిస్తున్న గ్రామంలో మొదటిగా గ్రామసభ నిర్వహించి, భూ యజమానికి నోటీసులిచ్చి భూ రీసర్వే చేయాలన్నారు. కానీ నేటి వరకు భూ రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో గ్రామసభ నిర్వహించకుండానే రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూ రీసర్వే చేయడం, అబ్జెక్షన్‌ ఫారం ఇవ్వకుండానే సర్వే ప్రక్రియ పూర్తి చేయడం వలన అనేక లోపాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి ప్రకారం భూ రీసర్వే చేపట్టాలని కోరారు. సర్వేలో పద్ధతి పాటించకపోవడం వల్ల ఇప్పటికే మండలంలో ములగ రెవెన్యూలో లచ్చన్నదొరవలసలో సర్వేనెంబర్‌ 26, 27 గిరిజనులకు 1991లో పట్టాలు ఇచ్చినప్పటికీ, ఇటీవల కాలంలో చేపట్టిన రీసర్వేలో ఆ భూములకు రిజర్వే చేయలేదని అన్నారు. గరుగుబిల్లి మండలంలోని శివ్వాం రెవెన్యూలో సర్వేనెంబర్‌ 20 నుండి 30 వరకు గల భూములు దళితులకు 1970లో పట్టాలిచ్చినా ఆ భూమిని కూడా సర్వే చేయలేదని తెలిపారు. ఇదే మండలంలోని పోలినాయుడువలస రెవెన్యూలో ఇనాం భూములు సర్వే చేయలేదని తక్షణమే ఆయా భూములపై సర్వే చేసి ఆయా రైతులకు దాఖలు పరచాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు గేదెలు సత్యనారాయణ, బంటు దాసు, శివ్వాం, పోలినాయుడు వలస, లచ్చన్న దొర వలస గ్రామ రైతులు పాల్గొన్నారు.