Sep 19,2023 21:47

భూ రీ సర్వేకు రికార్డులు పక్కాగా సిద్ధం చేయండి: తహశీల్దారు

భూ రీ సర్వేకు రికార్డులు పక్కాగా సిద్ధం చేయండి: తహశీల్దారు
ప్రజాశక్తి -బుచ్చినాయుడు కండ్రిగ:మండలంలో త్వరలో మరో రెండు గ్రామ రెవెన్యూలలో చేపట్టనున్న భూముల రీసర్వే కోసం భూములకు సంబంధించిన రికార్డులు పక్కాగా సిద్ధం చేయాలని తహశీల్దారు భార్గవి తెలిపారు. మంగళవారం తహశీల్దారు కార్యాలయంలో భూముల రీ సర్వే పై విఆర్‌ఓ లు, సచివాలయాల సర్వేయర్లతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే రైతులకు ఓ వరమని రైతులందరూ భూముల రీ సర్వేకు సహకరించాలన్నారు. భూముల రీసర్వే లో ఆన్‌ రిజిస్టర్‌ వంశపారపర్యం భూములను గుర్తించి రికార్డులలో నమోదు చేసి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తామని పెండింగ్‌ భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. సాగులో ఉన్న వారి పేరుపై భూమికి పాస్‌ పుస్తకాలు వస్తాయని ఆన్‌ లైన్‌ లో వారి పేరు నమోదు అవుతుందన్నారు. భూమి కొలతలు పక్కాగా ఉంటాయని హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.