Jul 17,2023 00:04

జెండాలు పట్టుకుని పొలాలకు ప్రదర్శనగా వెళ్తున్న బాధిత దళితులు, నాయకులు

ప్రజాశక్తి - చిలకలూరిపేట : భూములు కోల్పోయిన తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ లేక పస్తులుంటున్నామని యడవల్లి దళిత రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఉపాధి హామీ పనులనూ చూపకపోవడంతో వలసవెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, ఆ ప్రాంతాల్లోనూ పనులు సరిగా దొరగడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమ వద్ద గ్రానైట్‌ పేరుతో తీసుకున్న భూములకు పరిహారంగా మరోచోట భూములివ్వాలని, లేదా సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ తమ భూములను తామే సాగుచేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ భూముల్లో సాగుకు సిద్ధమై ఆదివారం దుక్కులు దున్ని విత్తనాలేశారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), ఎంఆర్‌పిఎస్‌ అండగా నిలిచాయి. ఈ సందర్భంగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ దళితుల భూములను లాక్కోవడానికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారని, సొసైటీ రద్దు చేశారని మండిపడ్డారు. కనీసం భూసేకరణ చట్టం ప్రకారమైనా పరిహారం ఇవ్వాలని తహశీల్దార్‌, ఆర్‌డిఒ, కలెక్టర్‌ కార్యాలయాల్లో విన్నవించినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. అత్తెసరు పరిహారంతో సరిపెట్టారని, దళిత ఒంటరి మహిళలను మోసం చేసి ఆ కొద్దిపాటి పరిహారాన్ని కూడా రవీంద్ర, రాంబాబు కాజేశారని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ పేదలు, అందునా దళితులు కాబట్టే ఏం చేసినా అడిగేవారుండరని ప్రభుత్వం, అధికారులు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. బాధితులకు అండగా తామంతా పోరాడతామని చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఈ భూములను తీసుకోవడానికి యత్నించగా దళితులు పోరాడారని, ప్రతిపక్ష నేతగా ఆ ఉద్యమానికి జగన్‌ మద్దతిచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి భూములను లాక్కున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేదాక పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు నాయకులు ఎం.విల్సన్‌, ఫైరోజ్‌, ఎంఆర్‌పిఎస్‌ పల్నాడు జిల్లా కన్వీనర్‌ ఎ.బాబు పట్టణ అధ్యక్షులు కె.కుమార్‌, దళితులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సిఎం, మంత్రి మాట తప్పారు
మట్టుకొమ్మ యాకోబు, వేల్పుల వేములమ్మ, కాకాని రోశయ్య

మట్టుకొమ్మ యాకోబు పొలాన్ని వేల్పుల యాకోబ్‌గా మార్పు చేసి పరిహారాన్ని కాజేశారు. దీనిపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. భూమిపోయి పనుల్లేక పస్తులుంటున్నాం. ఇక్కడ పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలసెళ్లాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, స్థానిక మంత్రి విడుదల రజని మాకు తీవ్రంగా అన్యాయం చేశారు. పట్టాలిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వారు తర్వాత మాట తప్పారు. వివిధ సంఘాల అండతో దీర్ఘకాలికంగా పోరాడుతున్నా మా గోడును పట్టించుకోవడం లేదు.