ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రాష్ట్రంలో 54 వేల ఎకరాలను భూమిలేని పేదలకు అసైన్మెంట్ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.రోశయ్య, ఎ.లకీëశ్వరరెడ్డి చెప్పారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. భూ పంపిణీని ఒక విధానంగా ప్రకటించి నవరత్న పథకాల్లో ఒక పథకంగా చేర్చాలని కోరారు. అసైన్‌మెంట్ అయిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కుల పేరుతో భూస్వాములు, వ్యవసాయేతరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసే అవకాశం ఇవ్వడాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికే సాగుభూమి పరాయికరణ చెందుతుందని, ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఈ వేగం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ గ్రామంలో భూమి అమ్మకాలు, కొనుగోళ్లు పరిశీలించినా వ్యవసాయం చేసే వారెవరూ భూములు కొనడం లేదని, కేవలం తమ డబ్బు దాచుకోవడానికి భూములు కొంటున్నారన్నారు. దీనివల్ల సాగు చేసే వారి చేతిలో భూమి లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగుభూముల్లో వెంచర్లు వెలిశాయని, మరోవైపు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు వలసలు వెళుతున్నారని చెప్పారు.ఈ పరిస్థితులు మారాలంటే సాగు చేసే వారి చేతిలో భూమి ఉండాలని, పంటలకు మద్దతు ధరలు దక్కాలని అన్నారు. ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో పేదలకు భూ పంపిణీ చేయడానికి వేలాది ఎకరాల సిద్ధంగా ఉన్నాయని అయినా ప్రభుత్వం చొరవ చేయడం లేదని విమర్శించారు. గురజాల మండలం చర్లగుడిపాడులో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. నాదెండ్ల మండలం గొరిజవోలులో 150 ఎకరాలు పేదల చేతుల్లో ఉన్న సాగు భూమిని రికార్డుల్లో చెరువుగా నమోదు చేశారని, రీ సర్వే సందర్భంగా వాస్తవాలను నమోదు చేయాలని, ఈ భూమిని రీ క్లాసిఫికేషన్ చేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే జిల్లాలో పేదలకు భూమి పంపిణీ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, వాటన్నిటిని బయట పెట్టడానికి త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.










