కడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ భూములేగాక పట్టా భూములు సైతం ఆక్రమిస్తున్న కబ్జాదారులపై (భూ బకాసురులపై) చర్యలు తీసుకునేలా సిట్టింగ్ జడ్జి చేత విచారించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక హరి టవర్స్ భూ కబ్జాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ కబ్జాలపై సదస్సు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన సామాన్యులు జానడు ఇంటి స్థలం, రెండు ఎకరాలు సాగు భూమి కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా సవాలక్ష ప్రశ్నలు వేసే రెవెన్యూ అధికారులు వందల ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు పోటీపడి ప్రభుత్వ భూములే కాకుండా వివాదాస్పద పట్టా భూములు సైతం ఆక్రమించి కబ్జాచేసి చివరకు సెటిల్మెంట్‌లో తేడాలు వస్తే హత్యలకు సైతం వెనకాడడం లేదని చెప్పారు. ల్యాండ్ మాఫియా రెచ్చిపోయి వంక,వాగు, రస్తా, చెరువు, దేవాదాయ, ఇనాం, అసైన్డ్ భూములు అన్నింటిని ఆక్రమిస్తే కాపాడాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులే చర్యలు తీసుకోకుండా వారికి కట్టబెట్టేందుకు తహతహలాడుతున్నారని, అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నాయకులు బి. నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జకరయ్య, అయ్యవారయ్య, బిఎస్‌పి నాయకులు గురప్ప, జనతాదళ్ పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి, లోక్ సత్తా పార్టీ నాయకులు దేవర శ్రీకష్ణ, సిపిఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ, సహాయ కార్యదర్శి కెసి.బాదుల్లా, నగర కార్యవర్గ సభ్యులు మనోహర్‌రెడ్డి, రాయలసీమ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు జెవి.రమణ, హేతువాద సంఘం నాయకులు సిఆర్‌వి ప్రసాద్, ఎంఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె.మునయ్య, ఎఐవైఎఫ్ నగర కన్వీనర్ ఎస్.కె. మైనుద్దీన్ పాల్గొన్నారు.










