Feb 20,2023 23:43

అతిథులకు మెమోంటోలు అందజేస్తున్న లా వర్సిటీ విసి ఆచార్య సూర్యప్రకాష్‌

ప్రజాశక్తి-సబ్బవరం
భూమి హక్కులు, రికార్డులు, చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌, ఎస్‌ఆర్‌సి హైదరాబాద్‌ స్పాన్సర్‌తో స్థానిక దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీ ఆధ్వర్యంలో భూమి, హక్కులు, రికార్డులు, చట్టాలు, పాలన, సవాళ్ల అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.సూర్య ప్రకాష్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకున్న దివానీ హక్కులు, టాక్స్‌ కలెక్షన్‌ హక్కుల నుండి భూచట్టం, దాని పరిణామం చరిత్ర ప్రారంభమైందని తెలిపారు. బ్రిటీషర్లు భూమి రెవెన్యూ వసూలు క్రమంలో అనేక చట్టాలను రూపొందించారని చెప్పారు. భారతదేశంలో నేటికీ 70శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, చాలా ముఖ్యమైన ఇలాంటి అంశంపై సెమినార్‌ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె.సుధ, బృందాన్ని అభినందించారు.
ముఖ్య అతిథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కెజి శంకర్‌, స్వతంత్ర న్యాయ పరిశోధకురాలు డాక్టర్‌ ఉషా రామనాథన్‌ కీలకోపన్యాసం చేశారు. నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా అడ్జంక్ట్‌ ప్రొఫెసర్‌ సునీల్‌ కుమార్‌ గ్రామీణ భూ యజమానులకు భరోసా కల్పించడానికి న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల కర్తవ్యాన్ని నొక్కి చెప్పారు. అడిషనల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎఎండి ఇంతియాజ మాట్లాడుతూ 1800లో మొదటి సారి భూసర్వే నిర్వహించారని, ఆ తర్వాత 1910లో భారీ యంత్రాలతో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా భౌతిక పద్ధతిలో రీసర్వే చేపట్టారని తెలిపారు. 100 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పుడు రీసర్వే జరుగుతుందని, డ్రోన్‌లు, హై టెక్నాలజీని ఉపయోగించి 2023 డిసెంబర్‌ చివరి నాటికి దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టారని చెప్పారు. భూ పరిపాలన వ్యవస్థలో సౌలభ్యాన్ని, భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ సర్వే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.మధుసూదనరావు, డాక్టర్‌ కె.సుధ, పి.బయోలా కిరణ్‌ కన్వీనర్‌, కో కన్వీనర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.