ప్రజాశక్తి - కలెక్టరేట్ : విశాఖ రూరల్ మండలం జివిఎంసి జోన్ - 2 కొమ్మాది, రేవళ్లపాలెం, బక్కన్నపాలెం గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూములలో నిర్మించిన ఇళ్లు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. సోమవారం నిర్వాసిత రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివిఎంసి జోన్ 2 పరిధి ఆరో వార్డులో కొమ్మాది, బక్కన్నపాలెం, రేవళ్ళపాలెం గ్రామాల్లో 94 నుంచి 102 వరకు గల రెవెన్యూ సర్వే నెంబర్లులో 86 మంది పేద, దళిత, వెనుకబడిన తరగతులకు చెందిన రైతులకు 44 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరం చొప్పున భూములు ఇచ్చిందన్నారు. అప్పట్లో రైతులు ఆ భూములలో సాగుచేయడంతో పాటు ఆవులు, గేదెలు పెంచుకుంటూ జీవనోపాధి సాగించేవారని, మరికొంత మంది కోళ్లఫారం లాంటివి కూడా పెట్టి సరిగ్గా నడవక నష్టపోయారని తెలిపారు. ఆ భూములు ఉపయోగించి జీవనోపాధి పొందేందుకు అప్పులు చేశారన్నారు. తరువాత ఆ భూములను ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా తీసుకుందని తెలిపారు. ఆ భూములలో జవహర్ నవోదయ విద్యాలయం, పోలీస్ శిక్షణ కేంద్రం, వికలాంగుల ఐటిఐ, పట్టు పురుగుల శాఖ కార్యాలయాలు నిర్మించారన్నారు. రైతులకు ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వలేదని తెలిపారు. అప్పట్లో రైతులు అధికారులను సంప్రదించగా నష్టపరిహారం చెల్లించడానికి, ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి వాగ్దానం చేసారన్నారు. ఇప్పటి వరకు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా న్యాయం చెయ్యలేదన్నారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కలగలేదన్నారు. ఆ భూములలో 2016, 2017ల్లో జూనియర్ కాలేజీ, ఎన్‌టిఆర్ హుదూద్ ఇళ్లు నిర్మించారన్నారు. ఈ భూముల్లో ఇళ్ల కోసం కోరగా అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ అధికారులు ఇక్కడ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వారి ఆర్థిక సాయంతో పేదలకు, హుదూద్ తుపానులో నష్టపోయిన వారి కోసం ఇళ్లు జి3గా నిర్మిస్తున్నామని, ఆ ఇళ్ళు రైతులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారు భూములు కోల్పోయిన వారికి ఇళ్లు ఇచ్చేందుకు పేర్లు కూడా నమోదు చేశారన్నారు. రాష్ట్ర హైకోర్టు భూములు కోల్పోయిన రైతులందరికీ ఇళ్లు మంజురు చేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయమై అనేకసార్లు విన్నవించినా, ఇళ్లు కేటాయించకుండా తీవ్ర అలసత్వం వ్యవహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని భూములు కోల్పోయిన రైతులందరికీ ఇళ్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, పార్టీ మధురవాడ జోన్ కార్యదర్శి డి.అప్పలరాజు, నాయకులు పైడితల్లి పాల్గొన్నారు.










