Jul 30,2023 01:38
భట్టిప్రోలులో నిలిచిన వాహనాలు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో రోజు రోజుకూ ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారిని ఆక్రమించి వ్యాపార దుకాణాలు రహదారి వద్దకు కట్టడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకునే అవకాశం లేక ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. కూరగాయల మార్కెట్‌ నుంచి స్టేట్‌ బ్యాంక్‌, చావలి సెంటర్‌ మీదుగా పాత కెఎస్‌కె కళాశాల వరకు ఈ ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించే నాథుడే లేడు. గత కాంగ్రెస్‌, టిడిపి పాలనలో రహదారి సర్వే చేసి ఆక్రమణలు తొలగించి రహదారిని విస్తరిస్తామని నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అదే రీతిలో గత ఏడాది వైసిపి పాలనలో నేటి మంత్రి మెరుగు నాగార్జున కూడా ఈ రహదారిని సర్వే చేయించారు. అద్దేపల్లి మసీదు సెంటర్‌ నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు చేసిన సర్వేలో పాత కెఎస్‌కె కళాశాల నుంచి మార్కెట్‌ వరకు రహదారి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆ మేరకు మంత్రి నాగార్జునకు నివేదికలు సమర్పించారు. ఈ ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపడతారని అందరూ భావించారు. కానీ మంత్రి చర్యలు కూడా నిరూపయోగమయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా మద్యం దుకాణం ఉండటంకూడా ట్రాఫిక్‌ అంతరాయనికి కారణంగా ఉంది. ట్రాఫిక్‌ సమస్య పత్రికలలో వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు కూడా స్పందించి ఒకటి రెండు రోజులు పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్‌పై చర్య చేపట్టటం తరువాత వదిలేయడంగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.