ప్రజాశక్తి - ముసునూరు
మండలంలో మహిళ దారుణంగా హత్య చేయబడిన సంఘటన సంచలనం సృష్టించింది. ముసునూరు ఎస్‌ఐ యం.కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన ఓలేటి రవీంద్ర భార్య ఓలేటి మణి(30) గురువారం మధ్యాహ్నాం సమయంలో వరి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేస్తున్న సమయంలో ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తలపై నరికి పారిపోయాడని, భర్త కేకలు వేస్తూ, చుట్టు పక్కల వారిని పిలవగా వారు వచ్చేసరికే ఆమె ప్రాణం పోయింది. ఆమెకు బలంగా దెబ్బలు తగలడంతో మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే హాత్య చేసి వుంటాడని గ్రామస్తులు, ఇంటి పరిసర ప్రాంతాల వారు అనుమానిస్తున్నారు. మృతురాలికి ఇంటర్ చదివే కుమార్తె, 9వ తరగతి చదువుతున్న కుమారుడు కలరు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ సిఐ ఆర్.అంకబాబు, ఎస్‌ఐ యం.కుటుంబరావు, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూజివీడు డిఎస్‌పి అశోక్ కుమార్‌గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి భర్తను దర్యాప్తు చేయగా, అనుమానాస్పద మృతిగా చిత్రికరించేందుకు ప్రయత్నం చేసే సమయంలో తన భర్తే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.










