భరత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్
ప్రజాశక్తి - బండి ఆత్మకూరు
భరత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎస్‌సి కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఏ.కోడూరు గ్రామంలో సర్పంచి మన్నే జ్ఞానాభరణం అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్‌సి కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎస్‌సి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, కేవలం ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిగా రాజ్యాంగం అంటే తెలియని వారు చెబుతుంటారని అన్నారు. అంటరానితనం, కుల వివక్ష, మనువాద సిద్ధాంతాలను ఎదిరించి, ఎన్నో అవమానాలు భరించి ఆయన భరత జాతి అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి భరతజాతికి ఓటు హక్కును సాధించారని చెప్పారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. భారతదేశంలోని ప్రతి కులానికి, ప్రతి జాతికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రపంచ రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, ఎంపిపి దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాయికాటి బెనర్జీ, నంద్యాల తహశీల్దార్ బి.శ్రీనివాసులు, బండి ఆత్మకూర్ తహశీల్దార్ ఉమారాణి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.










