ప్రజాశక్తి - పరిగి : అనారోగ్యం, రేచీకటి ఉన్న భార్య తనకు వద్దని వ్యక్తి ఆమెను వదిలేడయంతో బాధితురాలు తన భర్త ఇంటిముందు నిరసనకు దిగింది. పరిగి మండలం కోడిగేనహళ్లి దామోదర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబందించిన వివరాలు... మండలంలోని కోడిగేనహళ్లికి చెందిన తులసిరామ్ 2019 సంవత్సరంలో దీప అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడంతో భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు దీపను వేధింపులకు గురిచేశారు. అయితే ఈ వేధింపులనను కుమార్తె ద్వారా తెలుసుకున్న తండ్రి ఆమెను తన సొంత ఊరు సోమందేపల్లికి తీసుకెళ్లారు. ఇదే అదునుగా భావించిన తులసిరాం కుటుంబ సభ్యులు ఆమెను వదిలించుకోవాలని ఉద్దేశంతో కోర్టు ద్వారా విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె జీవిత పరిణామాలను గమనిస్తూ మనోవేదనకు గురైన ఆమె తల్లి వెంకటలక్ష్మి మనస్థాపానికి గురై అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మనోవేదనతో తన తండ్రి సైతం అనారోగ్యంతో ఉండటంతో దీప తన మెట్టినింటికి వెళ్లాలని నిశ్చయించుకుంది. మంగళవారం సోమందేపల్లి నుండి తన భర్త తులసిరామ్ ఉన్న ఇంటి వద్దకు చేరుకుని తన మామ గంగాధర్‌తో తన భర్త కావాలని అడగింది. దీంతో వారు దీపను బయటకు పంపి ఇంటికి తాళం వేసుకున్నారు. అయినప్పటికీ దీప తన భర్తను తనకు అప్పగించాలని ఇంటి ముందు కూర్చుని నిరసన తెలిపింది. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం రావడంతో విలేజ్ కానిస్టేబుల్ సుకన్య ఆమె తండ్రికి సమాచారం అందించి స్టేషన్‌కు తీసుకెళ్లారు.










