ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
తన భర్త వేరే యువతితో సహజీవనం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటిముందు ఆందోళనకు దిగిన ఘటన జంగారెడ్డిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. తనకూ, తన బిడ్డకూ న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. బాధితురాలు వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన పోలవరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు జీలుగుమిల్లి మండలం బొత్తప్పగూడేనికి చెందిన వేముల వెంకాయమ్మకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి మగ బిడ్డ ఉన్నట్లు తెలిపింది. కొద్దికాలంగా నాగరాజు తనతో సఖ్యతగా ఉండటం లేదని, వేరే యువతితో సహజీవనం చేస్తున్నట్లు వెంకాయమ్మ చెబుతోంది. ఇప్పటి వరకూ తనభర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఎదురుచూస్తూ కాలం గడిపానని, అయితే ఇటీవల తననూ, బిడ్డనూ పూర్తిగా వదిలించుకునే విధంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని నాగరాజు ఇంటి వద్ద నిరసన చేపట్టినట్లు బాధితురాలు వాపోయింది. వెంకాయమ్మకు మద్దతుగా బొత్తప్పగూడెం గ్రామస్తులు నిలిచారు.










