Mar 14,2023 23:48

లత (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
భర్త ఇనుప రాడ్డులో తలపై కొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ఆర్‌.శివరాంపురం గ్రామానికి చెందిన చందక నూకరాజుకు అదే గ్రామానికి చెందిన లత (28)తో 2019లో వివాహం జరిగింది. నూకరాజు కందిపూడి సమీపంలోని ఒక ప్రైవేట్‌ స్థలంలో డెయిరీ ఫామ్‌ నిర్వహిస్తున్నాడు. నూకరాజు, లత ఏడాది పాటు అన్యోన్యంగా ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భార్యను అనుమానిస్తూ నూకరాజు తరచూ గొడవలకు దిగుతూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఈ నెల 12న ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కందిపూడి డెయిరీ ఫామ్‌ వద్ద భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్త నూకరాజు ఇనుప రాడ్డుతో భార్య లత తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో లత తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు లత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చిన లతను విశాఖపట్నం కెజిహెచ్‌ తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం కేజీహెచ్‌లో లత మృతి చెందింది. నిందితుడు నూకరాజును పోలీసులు అరెస్టు చేశారు. లత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.కుమారస్వామి తెలిపారు.