Jul 28,2023 23:19

ఈ-శ్రమ్‌ కార్డు నమోదు చేస్తున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి- రణస్థలం: అసంఘటిత రంగంలో పనిచేసే వారికి భరోసానిచ్చే కార్డు ఈ-శ్రమ్‌ అని జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.వి.శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో ఈ-శ్రమ్‌ కార్డులను శుక్రవారం నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఎలాంటి ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ ఉండరాదని అన్నారు. అలాంటి వారికి ఆర్థిక, సామాజిక భద్రత అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ-శ్రమ్‌ కార్డును తీసుకొచ్చిందని తెలిపారు. దీన్ని లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, రూ.లక్ష ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. వీటితో పాటు ప్రభుత్వం అందించే పథకాలు, ప్రయోజనాలు నేరుగా ఈ-శ్రమ్‌ ద్వారా అందజేస్తారన్నారు. దీనికి ఎవరు అర్హులు, ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయాలు అసంఘటిత రంగంలో పనిచేసే వారు తప్పనిసరిగా తెలుసుకో వాలన్నారు. అసంఘటిత రంగంలో పని చేసేవారు 16-59 వయసు మధ్య ఉన్న వారందరు దీనికి అర్హులన్నారు. ఆధార్‌ కార్డుతో లింక్‌ అయినా ఫోన్‌, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ డాక్యుమెంట్స్‌ కావాలన్నారు.