పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మందిపై ప్రభావం చూపి, ఇప్పటికీ నవజాత శిశువులను వెంటాడుతున్న ఈ దారుణం నుండి పాలక వర్గాలు పాఠాలు నేర్చుకున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం లేదనే! పాఠాలు నేర్చుకునే ఉంటే, విశాఖలో ఈ ఏడాది మే నెలలో మరో గ్యాస్ లీకేజి చోటుచేసుకునేదే కాదు! కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా బాటలు పడేవి కావు ! కార్పొరేట్ యాజమాన్యాలకు, మన పాలక వర్గాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా ఈ ప్రమాదాలు బట్టబయలు చేస్తున్నాయి.
కొన్ని ప్రమాదాలను మరచిపోలేము. ఏళ్లు గడుస్తున్నా గాయం మాత్రం ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది. తరాల తరబడి ప్రమాద దుష్పరిణామాలు వెంటాడుతుండటమే దీనికి కారణం. దేశ చరిత్రలో భోపాల్ దుర్ఘటన అటువంటిదే! భారత పారిశ్రామిక చరిత్రలో మరచిపోలేని విషాద సంఘటనగా ఇది మిగిలిపోయింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ కక్కిన విషంతో భోపాల్ మృత్యు నగరంగా, శవాల దిబ్బగా మారి నేటికి 36 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మందిపై ప్రభావం చూపి, ఇప్పటికీ నవజాత శిశువులను వెంటాడుతున్న ఈ దారుణం నుండి పాలక వర్గాలు పాఠాలు నేర్చుకున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం లేదనే! పాఠాలు నేర్చుకునే ఉంటే, విశాఖలో ఈ ఏడాది మే నెలలో మరో గ్యాస్ లీకేజి చోటుచేసుకునేదే కాదు ! కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా బాటలు పడేవి కావు! కార్పొరేట్ యాజమాన్యాలకు, మన పాలక వర్గాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా ఈ ప్రమాదాలు బట్టబయలు చేస్తున్నాయి. నష్టపరిహారం చెల్లించకపోయినా, ఇప్పటికీ అంతర్జాతీయ న్యాయస్థానాల చుట్టూ బాధితులు, వారి వారసులు తిరుగుతున్నా భోపాల్ దుర్ఘటనకు కారణమైన కార్బైడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం భారత్‌లో రకరకాల పేర్లతో వ్యాపారం చేసుకుంటూనే ఉంది. ఆ సంస్థ తయారు చేసే సౌందర్య సాధనాలకు భారత్ అతి పెద్ద మార్కెట్! కొవ్వాడ అణుప్లాంటు విషయంలో మరీ ఘోరం ! ఆర్థికంగా దివాళా తీసి, ఐపి పెట్టిందని తెలిసినప్పటికీ వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీకి రియాక్టర్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అది కూడా జరగరానిది ఏదన్నా జరిగితే నిర్మాణ సంస్థకు ఎటువంటి బాధ్యత లేదన్న ముందస్తు షరతుతో! పైగా దీని కోసం అమెరికా లాబీయింగ్! ఈ ఏడాది ఫిబ్రవరిలో మన దేశానికి వచ్చిన అమెరికా (త్వరలో మాజీ కాబోతున్న) అధ్యక్షుడు ట్రంప్ వెస్టింగ్‌హౌస్‌కు పనులు అప్పగించే పనిని త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. సాక్షాత్తు కార్పొరేట్ మహారాజైన ట్రంప్ కుటుంబ ప్రయోజనాలు ఈ వ్యవహారంలో వున్నాయంటూ వార్తలు వచ్చాయి. వీటిపై అటు అమెరికా అధికారులుగానీ, 'జీ హుజూర్' అంటూ ఆయన ఆదేశాలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గానీ ఇంతవరకు పెదవి విప్పలేదు. పైగా సాంకేతిక వాణిజ్య ఒప్పందాన్ని అధికారికంగా కుదుర్చుకోవడానికి శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. ఉన్నత స్థాయి నుండి అందిన ఆదేశాలతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోని ఉన్నత స్థాయి అధికారులు గడిచిన రెండు నెలలుగా ఆ పని లోనే నిమగమై ఉన్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకునే జనవరి నెలలోగానే ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారని సమాచారం. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ప్రమాణ స్వీకారం తరువాత కూడా కార్పొరేట్ సంబంధాల్లో మార్పు రాదన్న అంచనానే దీనికి కారణం. మన దేశం లోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పాత్రనే పోషిస్తుండటం గమనార్హం. నిజానికి కాంగ్రెస్ హయాం లోనే ఈ ఒప్పందానికి బాటలు పడ్డాయన్న విషయాన్ని విస్మరించలేం.
భోపాల్‌లో ఏం జరిగింది ?
1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి 'యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ' నుండి ఒక్కసారిగా వెలువడిన విష వాయువులు భోపాల్ నగరాన్ని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా విష వాయువులు చుట్టుముట్టడంతో ఏం జరుగుతోందో అర్ధంకాక, ఊపిరి ఆడక నిద్రలో ఉన్న వారు నిద్ర లోనే ప్రాణాలు విడిచారు. విష వాయువుల బారి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన వారు రోడ్ల పైనే తుది శ్వాస విడిచారు. తెల్లవారే సమయానికి ఎక్కడ చూసినా శవాల కుప్పలతో భోపాల్ మృత్యు నగరంగా మారింది. వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో 10,047 మంది ప్రాణాలు కోల్పోయారని, 5,74,000 మంది విషవాయువుల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వ అంచనా! మృతుల సంఖ్య 15 వేల పైనే ఉంటుందని వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ప్రకటించాయి. విష వాయువుల దుష్ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. విస్మయాన్ని కలిగించే విషయమేమిటంటే ఇంతటి కల్లోలానికి కారణమైన విషవాయువేమిటో ఇప్పటికీ తెలియకపోవడం! 'తయారీ రహస్యం' పేరిట కార్బైడ్ సంస్థ ఆ వివరాలను వెల్లడించడం లేదు.
అణు దారుణాలు ఎన్ని..!
రసాయన పారిశ్రామిక రంగంలో హిరోషిమా అణుబాంబు విస్ఫోటనంతో సమానమైనదిగా భోపాల్ దుర్ఘటనను పోల్చారు. ఆ విషయాన్ని పక్కనబెడితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 100కు పైగా అణు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన ప్రమాదాలు 57! మొత్తం ప్రమాదాల్లో దాదాపు 70 శాతం అమెరికాలో జరిగినవేకావడం గమనార్హం. దీంతో అమెరికా ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. మన పాలక వర్గాలు మాత్రం అమెరికా చెప్పిందని, వ్యూహాత్మక ఒప్పందంలో భాగమని అంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే పనిని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు.
ప్రమాద తీవ్రత ఎంత...?
1986లో చోటు చేసుకున్న చెర్నోబిల్ అణు ప్లాంటు ప్రమాదంలో తక్షణమే 31 మంది మరణించినప్పటికీ ఆ తరవాత కాలంలో తీవ్ర ప్రభావం కనిపించింది. 2005-06 వరకు పరిసర ప్రాంతాల్లో రేడియేషన్‌కు గురై 4 వేల మంది మరణించారు. స్వల్పంగా రేడియేషన్‌కు గురైన ప్రాంతాలను పరిగణ లోకి తీసుకుంటే మృతుల సంఖ్య 9 వేల దాకా ఉంది. ఇప్పటికీ ఏదో ఒక లోపంతోనే శిశువులు పుడుతున్నారు. 2011లో జపాన్ లోని ఫుకుఫిమా ప్లాంటులో చోటుచేసుకున్న ప్రమాదమూ ఇటువంటి ప్రభావాన్నే చూపింది. ఈ ప్రమాదం తరువాత జపాన్ వ్యాప్తంగా ఉన్న 53 అణుప్లాంట్లను కొన్ని సంవత్సరాల పాటు అక్కడి ప్రభుత్వాలు మూసివేశాయి. ఫుకుషిమాను ఇప్పటికీ తెరవలేదు. భోపాల్ దుర్ఘటన ప్రభావమూ భావి తరాలపై తీవ్రంగా చూపిన విషయం తెలిసిందే. విష వాయువులు పీల్చిన గర్భిణీలకు పెద్ద సంఖ్యలో గర్భస్రావాలు కావడంతో 1984లో బయటపడిన ఈ దుష్పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్ నగరంలో దాదాపు ప్రతి చోటా బాధిత శిశువులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. వీరి సంఖ్యపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం అధికారికంగా వివరాలు ప్రకటించడం లేదు. మరోవైపు బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం, భవితరాల భద్రత కోసం ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అణు ప్లాంట్లలో పొరపాటున ప్రమాదం జరిగితే పరిణామాలు ఇంతకన్నా ఎన్నో రెట్లు ఘోరంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్పొరేట్లకు, అమెరికాకు సాగిలపడటం అలవాటు చేసుకున్న పాలక వర్గాలు భోపాల్ సంఘటన నుండి పాఠాలు నేర్చుకోవడానికి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడానికి సిద్ధపడటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేదాని కన్నా ఐక్య ప్రతిఘటన నుండే ఈ తరహా ప్రయత్నాలను అడ్డుకోగలం.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 36 ఏళ్లు
పొగడ దొరువు










