Dec 03,2021 06:33

  • భోపాల్‌ దుర్ఘటనకు 37 ఏళ్లు

అభివృద్ధి పేరుతో లాభాలే పరమావధిగా నడుస్తున్న పరిశ్రమల వల్ల పర్యావరణానికి, ప్రజలకు నష్టమని తెలిసి కూడా అటువంటి పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం నడుపుతున్నా పట్టించుకునేవారే లేరు! దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని భోపాల్‌, ఎల్‌.జి. ఘటనలు పునరావృతం కాక తప్పదనిపిస్తోంది.

     దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్‌ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్‌ దుర్ఘటనకు యూనియన్‌ కార్బైడ్‌ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక నివేదికలు తేటతెల్లం చేశాయి. దేశంలో ఈ ఘటన అనంతరం జరిగిన వాటిలో 2020 మే 7న విశాఖపట్నం లోని ఎల్‌.జి పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ కూడా భోపాల్‌ ఘటనను తలపించింది. విశాఖ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు వెయ్యి మందికి పైగా విష వాయువుల ప్రభావానికి లోనయ్యారు. సరళీకరణ విధానాల మూలంగా విదేశాల్లో నిషేధించిన అనేక విషపూరిత రసాయన, ఫార్మా కంపెనీలు మన దేశానికి రావడంతో ఏదో మూల భోపాల్‌ లేదా విశాఖ ఎల్‌.జి గ్యాస్‌ లీక్‌ లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇటీవల నవంబర్‌ 28న రాత్రి విశాఖపట్నం ఫార్మా సిటీలో విష వాయువులు విడుదల కావడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు యువ కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలన్నీ ప్రభుత్వ అండదండలతో యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. కానీ వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ చెప్పుచేతల్లోనే ఉండడం, అధికార పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడంతో అమాయక ప్రజలు ఈ దారుణాలకు బలైపోతున్నారు.
     భోపాల్‌ దుర్ఘటన నుండి ప్రభుత్వాలు ఏ గుణపాఠాలు నేర్చుకోలేదనే చెప్పాలి. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన వారెన్‌ ఆండర్సన్‌ను శిక్షించడంలోను, బాధితులకు నష్టపరిహారం అందించడంలోను ప్రభుత్వాలు అనుసరించిన తీరు అంత్యంత దుర్మార్గంగా నడిచింది. నేటికీ భోపాల్‌ దుర్ఘటన బాధితులు జీవచ్ఛవాలుగానే బతుకుతున్నారు. అభివృద్ధి పేరుతో లాభాలే పరమావధిగా నడుస్తున్న పరిశ్రమల వల్ల పర్యావరణానికి, ప్రజలకు నష్టమని తెలిసి కూడా అటువంటి పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం నడుపుతున్నా పట్టించుకునేవారే లేరు! పరిశ్రమల్లో ప్రమాణాలు కాపాడాల్సిన కాలుష్య నియంత్రణా బోర్డు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, ఫైర్‌ డిపార్డుమెంట్లు...ప్రభుత్వాలు చెప్పినట్లు, యాజమాన్యాలకు అనుకూలంగా అనుసరిస్తోన్న ఘటనలు అనేకం ఉన్నాయి. దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని భోపాల్‌, ఎల్‌.జి. ఘటనలు పునరావృతం కాక తప్పదనిపిస్తోంది. పర్యావరణ అసమతుల్యత కారణంగా ప్రకృతి విపత్తులు తలెత్తడం, వాతావరణ సమతుల్యత కొరవడడం వల్ల అనేక ప్రాంతాలు విలవిల్లాడడం చూస్తూనే ఉన్నాం. ఓజోన్‌ పొరకు జరుగుతున్న నష్టం భవిష్యత్తులో మరిన్ని విపత్తులకు దారితీస్తుందన్న పర్యావరణవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నారు. తీర ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వచ్చే విష వాయువులను సముద్రంలోకి వదలడంతో...మత్స్య సంపద, వాటిపై ఆధారపడుతున్న మత్స్యకారుల జీవితాలు దాదాపుగా నాశనమైపోయాయి. అందుకు బాధ్యత వహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అదుపు చేయకపోగా తీర ప్రాంతాన్ని ఒక డంపింగ్‌ యార్డుగా మార్చే పనిలో పడ్డాయి. పెట్రో కెమికల్‌ మరియు పెట్రో కారిడార్‌ల పేరుతో విదేశాల్లో నిషేధించిన కంపెనీలను, పర్యావరణానికి హాని చేసే కంపెనీలను నెలకొల్పేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సిఆర్‌జెడ్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి.
      విశాఖపట్నం సమీపంలోని పరవాడ వద్ద 'రాంకీ' డెవలపర్‌గా జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీని 2005లో నెలకొల్పారు. హైదరాబాద్‌ పఠాన్‌ చెరువులోని అనేక ఫార్మా కంపెనీలు, మరిన్ని దేశీయ విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడికి చేరాయి. ప్రస్తుతం 85 ఫార్మా కంపెనీలు 2500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా ఉత్పత్తులు చేస్తున్నాయి. ప్రతి ఏడాది నాలుగైదు కంపెనీల్లో ప్రమాదాలు జరగడం అనేక మంది మృత్యువాత పడడం, మరి కొంతమంది క్షతగాత్రులు కావడం జరుగుతోంది. గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 32 మంది వరకు మరణించారు. 80 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికారులు హడావుడి చేయడం, మృతులకు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తప్ప ఘటనపై సమగ్ర విచారణ జరపడం, వాటిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం, బాధ్యులను శిక్షించడం వంటివేవీ ఈ కాలంలో జరగలేదనే చెప్పాలి. గత ఏడాది ఇదే ఫార్మా సిటీ డెవలపర్‌గా ఉన్న 'రాంకీ' కి చెందిన విశాఖ సాల్వెంట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 500 మీటర్ల విస్త్రీర్ణంలో వుండాల్సిన గ్రీన్‌ బెల్ట్‌ను విస్మరించి కంపెనీలకు అమ్ముకున్నారు. చుట్టూ చెరువుల్లోకి వ్యర్ధాలను వదులుతున్నారు. పక్కనే ఉన్న తాడి గ్రామాన్ని తరలించకపోవడంతో అక్కడి ప్రజలంతా రోగాలు, రొచ్చులతో కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవనం సాగిస్తున్నారు. 'రాంకీ' సంస్థ యజమాని రాష్ట్ర అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫార్మా సిటీలో కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను గాలికొదిలేశారు.
     లాభాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వాలు దాసోహమైతే భవిష్యత్తులో మరిన్ని భోపాల్‌, ఎల్‌.జి. ఘటనలు పునరావృతం కాక తప్పదని పాలకులు తెలుసుకోవాలి. ఆ తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. లేదంటే కాలుష్య నియంత్రణపై, పర్యావరణ రక్షణకై ప్రజా ఉద్యమాలు మరిన్ని రాకతప్పవని గమనించాలి.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9490098799 /
వి.వి. శ్రీనివాసరావు

వి.వి. శ్రీనివాసరావు