- ఎపి ఫుడ్ కమిషన్ చైర్మన్‌కు బాలికల ఫిర్యాదు
ప్రజాశక్తి-ఎ.కొండూరు: వండిన కూరలే వండుతున్నారు... అసలు రుచి పచి ఉండడం లేదు... ఉదయం పూట చట్నీలో నీళ్లు కలుపుతున్నారు తినలేక పోతున్నాం... మజ్జిగ పోస్తున్నా తాగలేకపోతున్నా... కనీసం కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదు... అంటూ కస్తూరిబాగాంధీ విద్యాలయం బాలికలు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డికి విన్నవించారు. సోమవారం సాయంత్రం ఆయన ఎ.కొండూరులోని కస్తూరిబా విద్యాలయాన్ని సందర్శించి మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా అని బాలికలను అడిగారు. బాలికలు సమాధానం చెప్పకపోవడంతో వైట్ పేపర్లు ఇచ్చి సమాధానం రాయమన్నారు. దీంతో బాలికలందరూ విద్యాలయంలో తమకు పెట్టే ఆహార విషయంలో వస్తున్న ఇబ్బందులను రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు ఇక్కడ వంట వారికి ఏఎన్‌ఎంకు రాజకీయ అండదండలు ఉన్నాయని, వారు ఇక్కడ దీర్ఘకాలంగా ఉంటూ ఎవరి మాట వినకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తమకు బాలికల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఇక నుండి ఫిర్యాదులు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మరో నెల రోజుల్లో ఇక్కడకు వస్తానని అప్పటికి ఏ సమస్య ఉన్న ఊరుకోనని ఆయన హెచ్చరించారు విద్యాలయంలో బాలికలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే 9490 55 1117 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపాలని కోరారు. ఈ లోపాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రిన్సిపల్‌ను ప్రశ్నించగా మూడు నెలలుగా తమకు బిల్లులు రావడం లేదని, తాను అప్పులు తెచ్చి బాలికలకు పెడుతున్నానని చైర్మన్‌కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సురేష్, డీఎస్‌ఓ పద్మ, డిఎం మూర్తి, తాసిల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహరం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడంలో అధికారులు ఎటువంటి అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎపి ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజాఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీలలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లిలోని రేషన్ షాప్ నెంబర్ 44, అంగన్‌వాడీ ప్రైమరీ స్కూల్ 3, 4లను తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో కోడిగుడ్ల నాణ్యతను, ఆయిల్ ప్యాకెట్లు, పాలు, కందిపప్పు స్టాక్ రిజిష్టర్ ప్రకారం పరిశీలించారు. పిఎం మాతృవందన యోజన పథకంలో మొదటి కాన్పులో రూ.5 వేల నగదు గర్భిణీ స్త్రీలకు అందుతున్నది లేదని ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి మెనూ ప్రకారం భోజనం నాణ్యతను విద్యార్థులు నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.శివరామమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ పి సురేష్, డిఎస్‌ఓ కోమలి పద్మ, ఐసిడిఎస్ పీడీ జి.ఉమాదేవి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్ సూర్యారావు, తూనికలు కొలతల ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల, పరిటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలౌతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ప్రతాపరెడ్డి సోమవారం పరిశీలించారు. పరిటాల హైస్కూల్‌లో 100 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం పధకం వినియోగించుకోవటంతో ఆయన అభినందించారు. కంచికచర్ల హైస్కూల్‌లో 500 మందికి పైగా విద్యార్ధులు హాజరు ఉండగా, కేవలం 40 శాతం మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తండటంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి రోజూ కోడిగుడ్డు, ఇతర పోషక విలువలు కలిగిన మెనూ అందజేస్తున్నారన్నారు. ప్రతిరోజూ ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని, నాణ్యతను పరిశీలించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డియం మూర్తి, ఎంఈఓ యల్ చిట్టిబాబు, పీడీయస్ డీటీ ఇస్మాయిల్ పాల్గొన్నారు.










