
నాటింగ్‌హమ్ : భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 25 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సిబ్లీ (18), జో రూట్ (12) ఉన్నారు. కాగా, మ్యాచ్ ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేసి తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రోరీ బర్న్స్ (0) వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం మహ్మద్ సిరాజ్ వేసిన 21వ ఓవర్‌లో చివరి బంతికి జాక్ క్రాలే (27) ఔటయ్యాడు. కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్ 42 పరుగుల వద్ద ఉంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జో రూట్ దూకుడుగా ఆడాడు. సిరాజ్ వేసిన 22వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.