మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి
ప్రజాశక్తి -అనకాపల్లి : మధ్యాహ్న భోజన పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా తొలగించడం అన్యాయమని పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,. నవంబర్ ఒకటి నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఒక్కరే పనిచేయాలని, మిగిలిన వారు అవసరం లేదని ఉపాధ్యాయులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అడ్డం పెట్టుకొని కార్మికులను తొలగించడంతో రోడ్డున పడేయడం సరికాదని, గతంలో ఏ ప్రభుత్వమూ ఇటువంటి దుశ్చర్యకు పూనుకోలేదన్నారు. వైసిపి ప్రభుత్వం స్కూలు కమిటీల పేరుతో పాతవారిని తొలగించి అనుకూలంగా ఉన్న వారిని తీసుకుంటోందని, ఇంతవరకు చాకిరీ చేయించుకున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. భోజన పథకం ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విరమించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండిఎం యూనియన్ రాష్ట్ర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.










