Jan 17,2021 13:22

      ర్రటి మట్టిరోడ్డు మీద దుమ్ము లేపుకుంటూ బస్‌ ఆగింది. చేతి సంచి పట్టుకుని కాంతమ్మ, పెట్టి పట్టుకుని ఆమె వెనుక వెంకన్న బస్సు దిగారు. వాళ్ళని దింపి, తనపని అయిపోయిందన్నట్టు తీసుకొచ్చిన దుమ్ముని తనతోపాటు లేపుకుంటూ రివ్వున వెళ్లిపోయింది బస్సు.
పుట్టి పెరిగిన ఊరు రావాలంటే ఎవరికైనా మనసు ఉవ్విళ్లూరుతుంది. వెంకన్నకి మాత్రం గుబులు గుబులుగా ఉంది. చేయి పట్టుకుని తీసుకెళ్లిన కొడుకుని అక్కడ మట్టికి అప్పజెప్పి, బాధని వెంటబెట్టి తెచ్చుకుంటోంది కాంతమ్మ. బస్సు దిగి ఊళ్ళోకి కనీసం కిలోమీటరు నడవాలి. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. వెంకన్నకి ఈ ఊరు వదిలే ముందు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.
     'మనోళ్లని, మన పేనం లాంటి మట్టిని, పుట్టి పెరిగిన పాంతాన్ని వదులుకుని ఎందుకే కలో, గంజో తాగుతూ ఈడనే బతుకుదాం!' బతిమాలుతున్నట్లు చెప్పాడు.
'నాకు మాత్రం ఇట్టమా సెప్పు మామ. పైసలు సంపాదించాలని కాదు. మనలాంటి కూలీ బతుకు మన బిడ్డడికి ఉండకూడదని. వాడైనా నాలుగు అచ్చరం ముక్కలు సదువుకుని, పైకి రావాలని సిన్న ఆశ. దానికోసమే నా ఆలోసన!' ఒప్పించే ప్రయత్నంగా చెప్పింది కాంతమ్మ.
      పిల్లాడి భవిష్యత్‌ మాట అతన్ని మారుమాట చెప్పనివ్వలేదు. మౌనంగా ఆమెని అనుసరించాడు. అక్కడికి వెళ్ళి సాధించింది ఏమిటి? అందనంత ఉన్నత స్థానంలోకి తీసికెళ్లాలనుకున్న కొడుకు ఊహించని విధంగా వెళ్లిపోయాడు.
       ఎదురుగా సైకిల్‌ మీద వస్తూ 'ఏరా యెంకన్న, పట్టణం దురద తీరిందా?' ఆ మాటలో వెటకారం వెంకన్న గుండెలో గుచ్చుకుంది. సమాధానం చెప్పలేదు. వెంకన్న బలవంతంగా నవ్వాడు. కాంతమ్మకి కాలుతున్న శరీరం మీద కట్టె వేసినట్లనిపించింది. బాధ భగ్గుమంది.
ఊరిలోకి అడుగుపెట్టాలంటే ఇలాంటి మాటలు ఎన్ని వినాలో. ఊళ్ళోకొస్తుంటే కొన్ని చూపులు వెటకారంగా నవ్వుతున్నాయి. మరికొన్ని చూపులు సానుభూతితో గుండెల్ని గుచ్చేస్తున్నాయి. రెండింటినీ భరించడం కష్టంగా ఉంది.
నెమ్మదిగా జాలిచూపుల్ని దాటుకుంటూ ఇంటికెళ్లారు. అప్పటికే ఇల్లు శుభ్రంగా సిద్ధం చేసిన పక్కింటి పార్వతమ్మ అన్నం తీసుకొచ్చింది. ఆప్తురాలిని చూసిన కాంతమ్మలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమెని వాటేసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది పార్వతమ్మ.
'పార్వతమ్మా! ఆమెని ఏడవనీ. ఆ ఏడుపులోనైనా బాధ బైటకెళ్లిపోనీ. ఆమె ఏడ్చి చానా రోజులైంది. అందుకే ఏడ్వనీ!' వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు వెంకన్న.
పార్వతమ్మ మౌనంగా బైటికెళ్లిపోయింది. ఏడుస్తూ కాంతమ్మ నేలమీదే కొంగు పరచుకుని పడుకుంది. జీవితాన్ని చీకటిగా మార్చినరోజు మెదడు పొరల్లోంచి చొచ్చుకుని జ్ఞాపకంగా వస్తోంది. మనసుని నిశి తాకినప్పుడు కంట్లోంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీళ్లు చెంపల్ని తాకుతున్నాయి. వద్దనుకుంటున్నా కన్నీటికబుర్లు మనసు పొరల్లోంచి గుర్తుకొస్తున్నాయి.
                                                                                         

                                                                                       000

       ఆ రోజు అపార్ట్‌మెంట్‌ ముందు కళ్లాపి చల్లి, ముగ్గు లేస్తోంది కాంతమ్మ. ఓ పక్కగా నోట్లో పెట్టుకున్న వేపపుల్ల నములుతూ మధ్య మధ్య తుపుక్కున్న ఊస్తున్నాడు వెంకన్న. మంచం మీద ముసుగు వేసుకుని, పడుకున్నాడు శీనుగాడు. మంచంవైపు చూస్తూ 'శీనుగా! లెగరా, పండగ పూట పొద్దున్నే లేసి తలకు నూనె రాసుకో. శుభ్రంగా తల అంటుకుని భోగిదండ మంటలో వేద్దువు. రెత్రి మీ అయ్య తెచ్చిన బట్టలు పెట్టిలో పెట్టినా. త్వరగా లెగు.' అంటూనే బక్కెట్‌ చేతిలో పెట్టుకుని కుళాయి దగ్గరకు వెళ్లింది కాంతమ్మ. వెంకన్న ముసిముసిగా నవ్వుతున్నాడు.
ఆ నవ్వు చూసి చిర్రెత్తిన కాంతమ్మ 'ఎందయ్యా! పిల్లోడ్ని లెగ్గొట్టకుండా సోద్యం సూత్తున్నవ్‌. దానికితోడు ఆ ఎకిలి నవ్వేంది?'
'నవ్వితే తప్పేంటి? నవ్వు వచ్చింది నవ్వాను!' నవ్వుతూనే సమాధానం చెప్పాడు.
'వత్తాది, వత్తాది. పనీ పాటా లేకుండా కూసుంటే నవ్వే వత్తాది!' అని విసురుగా బక్కెట్లో మిగిలిన నీళ్లు కిందకు వొలకబోసింది.
వెంకన్న మొహం తుడుచుకుంటూ 'ఎప్పుడూ ఆడి గొడవేనా? నాకు టీ చుక్క పోసేదుందా?'
'అదే పనిలో ఉన్నా' అంటూ రెండు గ్లాసులతో టీ తెచ్చింది. భర్తకు ఓ గ్లాస్‌ అందించి, మరోగ్లాసు తీసుకుని ఎదురుగా కూర్చుంది.
'మనం ఈడకొచ్చి ఆరు నెలలు అవుతోంది. నా పేరు పూర్తిగా తెలియదు. శీనుగాడి నాన్నంటే అందరికీ తెలుస్తోంది. అందరికీ ఆడు తలలో నాలికయ్యాడు.
'ఓ ముడిసిపోకా, ఆడి సదువుకోసం ఇంత దూరం వచ్చాం. ఆడు సదువు వదిలేసి బలాదూర్‌ తిరుగుతోంటే కాసింత బుద్ధి సెప్పాల్సింది పోయి, తెగ గారం సేత్తనాడు.. గారం..' అంటూ కోప్పడింది కాంతమ్మ.
'ఆడు సిన్నపిల్లోడే. సరదాలు పడే వయసు. ఈ వయసులో సంబడాలు ఇప్పుడే తీర్సుకోవాలి. పైగా పట్నం వచ్చాం. దోస్తులుతో మజా చెయ్యనీ.'
'ఎందయ్యో, నీ బాస మారిపోతనాది. అడ్ని లేపు. తలకి సమురు రాయాలి. తలకి కుంకుడుకాయి రసంతో స్నానం సెయించాలి. భోగి మంటలో పిడకల దండ వెయ్యించాలి.'
'నీకు ఆడింక బోగిమంటలో దండలేసే బుడ్డోడులా అగుపిత్తానాడా? ఆడు మాత్రం నిన్న రేతిరే భోగి మంటలేసే దుంగలు ఎత్తుకురాడానికి లేసెళ్ళాడు.'
'అంటే మంచం మీద తొంగున్నది శీనుగాడు కాదా?' అమాయకంగా అడిగింది కాంతమ్మ.
'రెండు దిండ్లు పెట్టి, పైన దుప్పటి కప్పాడు!' వెంకన్న బిగ్గరగా నవ్వుతూ అన్నాడు.
'అంటే తండ్రీ, కొడుకూ కలసి నన్ను మోసం సెత్తారా? పిచ్చిదాన్ని సేసి ఆడేసుకుంతారా?' వస్తున్న ఉడుకుమోత్తనాన్ని ఆపుకుని, వెంకన్న వైపు కోపంగా చూసింది.
ఇంతలో శీనుగాడు వస్తూ 'అమ్మా నాకు నీళ్లు కాయే. ఉడుకు నీళ్లోసుకుని యెల్లాలి. పతంగులు పట్టాలి.'
'ఏం పట్టాలి?' తెలియదన్నట్లు మొహం పెట్టి అడిగింది కాంతమ్మ.
'అయ్యేనే, మన ఊళ్లో గాలిపటాలు అంటారు కదా! ఈడ పతంగులు అంటారులే' చెప్పాడు వెంకన్న.
'ఓహో! అలాగా, నాకు తెల్దులెండి' అర్థం అయినట్లు మొహం పెట్టింది.
'అవునురా శీను! గాలిపటాలు ఆకాశంలోకి ఎగరేస్తారు.. ఈ పట్టడం ఏందిరా?' అడిగాడు వెంకన్న.
'అదా, ఇక్కడ ఒక కాలనీకి మరో కాలనీకి పొటీ ఉంటది. ఎవరు ఎక్కువ పతంగులు పక్కవాళ్లవి తెగ్గొట్టి పట్టుకుంటే అంత గొప్ప. ఆళ్లే గెలిచినట్లు. మన కాలనీ గెలవాలి. అలాగే మన పతంగులే పైకి ఎగరాలి!' చాలా హుషారుగా చెప్పాడు శీను.
ఇంతలో బైట నుంచి 'శీను రా! రా!' కేక వినబడింది.
'అదిగో అప్పుడే దోస్తులు పిలుస్తున్నారు. ఉడుకు నీళ్లు జల్దీ ఇయ్యే. పోసుకుని ఎల్లాలి. నాకు సానా పనుంది' వీధి వైపు చూస్తూ తల్లిని తొందరపెట్టాడు శ్రీను.
'పది నిమిషాల్లో వచ్చేస్తారా!' వీధి వైపున్న స్నేహితుడిని చూసి అరిచాడు.
శీనుకి వేడినీళ్లు తోడి, ఇంట్లోకి వచ్చిన కాంతమ్మని చూసిన వెంకన్న చూపులు 'నీ కొడుకు పరపతి చూడు' అన్నట్లున్నాయి.
పెద్దగొప్పేలే అన్నట్లు కాంతమ్మ మూతి మూడు వంకర్లు తిప్పింది. వెంకన్న హాయిగా నవ్వుకున్నాడు.
'చూడు కాంతాలు! (హుషారులో వున్నప్పుడు వెంకన్న అలాగే పిలుస్తాడు) ఆరునెలల్లో నా కొడుకు కాలనీలో అందరికీ స్నేహితుడైపోయాడు. పెద్ద హీరో అయిపోయాడు. కిరికెట్‌ ఆట బాగా ఆడతాడుట! ఈడు బంతి కొడితే తేడం సానా కట్టమంట. ఈడు మాత్రం ఎవరైనా కొట్టిన బంతిని, ఎక్కడికి కొట్టిన ఇట్టే పట్టుకొత్తాడని తెగ గొప్పగా చెప్పుకుంటున్నారు. భలే హుసారుగా ఉంటాడని ఆళ్లలో అళ్లు చెప్పుకుంటుంటే ఇన్నాను. చాలా బాగానిపించింది!' సంతోషంగా చెప్పాడు.
'అది సరేలేవయ్యా, సదువు ఎలా సదువుతున్నాడో మాట్టర్ని అడిగి తెలుసుకున్నావా? అన్నీ వదులుకుని, అందర్నీ కాదనుకుని ఈడకొచ్చింది ఆడి సదువు కోసమే కదా! మనం ఆలోసించవలిసింది ఆడి చదువు గురించే. ఆడు సదువుకుని, పెద్ద పెద్ద ఉద్దోగాలు సేయాల. నాను నా కొడుకుని సూసి మురిసిపోవాల. అందరూ నా బిడ్డని గొప్పగా సెప్పుకోవాల. అది నా కలయ్యా. అయ్యన్నీ ఒగ్గేసి నువ్వు ఏదో ఆలోసిత్తనావు.'
'సరిలేవే, ఆడే సదువుకుంటాడు. నీ కల తీరుత్తాడు. ఏదో సిన్నతనం. ఈ వయసులోనే సరదాగా ఆటలు ఉండాలి. అది సరే కానీ, ఇంతకీ ఈ రోజు పెసలేం సేత్తనావ్‌?' అడిగాడు వెంకన్న.
'ఆడికి పులిగోర ఇట్టం. అందుకని పులిగోర సెత్తన్నా.'
ఇంతలో ఉడుకునీళ్లు పోసుకొచ్చిన శీనుగాడు 'అమ్మా! కొత్త బట్టలేయీ, పసుబెట్టినవా?' అంటూ ఉరకలేస్తున్నాడు.
'అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముందుగాల బొట్టు ఎట్టుకుని, దేముడికి దండం ఎట్టుకో. నీ కొత్త బట్టలు తెస్తా' గదిలో మూలనున్న పెట్టి దగ్గరకు వెళ్లింది. పెట్టిలో ఉన్న కొత్తబట్టలు తీసి, శీనుకి ఇచ్చింది. కొత్త బట్టలేసుకుని వచ్చిన శీనుని 'ఊరు నుంచి నీ కోసమే కట్టిన భోగి పిడకల దండ తెప్పించానురా, భోగిమంటలో వేసి వస్తే పాయసం తిని, ఆటకు ఎల్దువుగాని!' అంటూ భోగి పిడకల దండ అందించింది.
'సరేలేమ్మా! నాకేమీ ఆకలి లేదు. ఈ భోగిపిడకల దండ మంటలో వేసి, ఆడ నుంచే ఆటకెళ్లిపోతా!' కాంతమ్మ చెప్పే మాట వినకుండానే పరిగెట్టాడు.
'ఓరేయి, పండగపూట ఖాళీకడుపుతో ఎల్లకూడదురా! కడుపులో తడి ఉండాలి!' అంటూ కేకలేస్తూ బైటకొచ్చింది. ఆమె గుమ్మం దాటే సమయానికి శీనుగాడు వీధి మలుపు తిరిగేశాడు.
'ఈడు మాట ఇనకుండానే యెళ్లిపోనాడు!' చాలా బాధపడుతూ లోపలికి వచ్చింది కాంతమ్మ.
'పోనీలేయే. ఆడికి ఆకలేస్తే ఆడే లగెత్తుకుంటూ వత్తాడు. నువ్వు లోనకెళ్లి పనిసేసుకో. నేను అలా టీ బండి దాకా ఎల్లొత్తా!' భుజమ్మీద తువాలు వేసుకుని, బైటకొచ్చాడు. వెంకన్న బైట నుంచి తిరిగి వచ్చేసరికి కాంతమ్మ కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది.
'ఏందే అట్ట కంగారుగా తిరుగుతున్నావు, ఏటైనాది?' కాంతమ్మ కంగారు చూసి అడిగాడు వెంకన్న.
'సూడయ్యా, సూరీడు నడినెత్తికొచ్చాడు. ఇంతవరకూ పిల్లాడి అజ పజా లేడు. పొద్దుటే ఏమీ తినకుండానే యెల్లాడు!' బాధగా చెప్పింది.
'ఓ అదా! నాకు కనిపించినాడులే. ఎక్కడో పెద్ద తలం ఉందంట. ఆడ పోటీలు జరుగుతాయంట. ఈడు నేకపోతే కుదరదని బలమంతం సేస్తే యెలుతున్నానని నాకు సెప్పాడులే!'
'పండగపూట ఏటీ తినకుండా వెళితే ఎట్టా ఒప్పుకున్నవయ్యా!' తల్లి మనసు గింజుకుంది.
'నా కడ ఇరవై రూపాయలుంటే ఇచ్చానులే. ఏదైనా తినమన్నాను. ఆడు నీకే కాదు నాకూ కొడుకేనే! ఆడి ఆకలి నాకు తెల్దేటి?' తల్లి మనసు తృప్తినిచ్చే మాట చెప్పాడు.
'గొప్పపని సేసినావులే. ఎన్ని పైసలిచ్చిన నాను సేసిన పులిగోర వత్తాదేంటి? నా సేతివంట రుచి దొరుకుతాదేంటి? ఆడికి నా పులిగోరంటే పేనం!' కాంతమ్మ మాటల్లో కించిత్‌ గర్వం కనిపించింది.
ఇంతలో గుడిసె ముందు నుంచి వెళ్లిపోతున్న పెద్దావిడ 'ఈ పిల్లలేమిటో, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఆటలేమిటో అర్థం కావడం లేదు!' అనుకుంటూ వెళ్తోంది.
'అమ్మగోరూ ఏం జరిగినాది?' ఆమె మాట విన్న కాంతమ్మ అడిగింది.
'ఆటలో పిల్లాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడట! అది తెలిసి బాధనిపించి ఏదో అనుకుంటున్నానులేమ్మా. పోయినోడికి ఏం తెలుస్తుంది. తల్లి జీవితాంతం బతికున్నా చచ్చినట్టే. పిల్లాడు ఎవరైనా తల్లి మనసేగా విలవిల్లాడేది. ఆ విషయం ఈ కుర్ర పిల్లలకు అర్థం కాదు. దూకుడుతో కన్నూ మిన్నూ తెలవదు. అయినా పండగపూట మనసు పాడుచేసుకోకు. వెళ్లి నీ పని చేసుకో!' మాట చెప్పుకుంటూ వెళ్లిపోయింది.
లోపల కంచం పెట్టుకుని కూర్చున్న వెంకన్న' 'రాయే! నాకు ఆకలవ్తోంది, అన్నం పెట్టు. ఆడి కోసం కూకుంటే నాను ఈ పూట వన్నం తిన్నట్టే. నాకు వడ్డించు.'
'సరే కూకో, వన్నం పెడతా!' అంటూ కంచంలో అన్నం వడ్డించింది.
కలుపుకుని నోట్లో ముద్ద పెట్టుకోబోతుంటే బైట నుంచి పిలుపు 'వెంకన్నా! వెంకన్నా!'
కంచం ముందు నుంచి వెంకన్న లేవబోయాడు. 'ఆగవయ్యా! తినేటప్పుడు లేవకూడదు!' వారించి బైటకెళ్లింది. మొత్తం కాలనీ అంతా కదలి వచ్చినట్లుంది. అంతమంది జనాన్ని చూసి బెదిరిపోయింది కాంతమ్మ! వెంటనే కొడుకు గుర్తొచ్చాడు. 'ఏటైనాది, నా బిడ్డ ఏడి?' అంటూ జనంలో కొడుకుని వెతుక్కుంటోంది.
ఇంతలో పక్క అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ భార్య వచ్చి 'ఏమీ కాలేదక్కా. ఏదో సిన్న దెబ్బ అంతే. హాస్పిటల్‌ కాడకి తీసుకెళ్లారు. అది సెపుదామనే.. అంతే' నెమ్మదిగా భుజం చుట్టూ చేయి వేసి, లోపలికి తీసుకెళ్లింది.
ఈ హడావిడి గమనించిన వెంకన్న బైటకొచ్చాడు. టీ కొట్టు పానకాలు ముందుకొచ్చి 'వెంకన్నా, అలా హాస్పిటల్‌ దాకా వెళ్లొద్దాం రా!' మాటలు చెప్పి, బైటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇంతలో పోలీసు జీపు అపార్ట్‌మెంట్‌ ముందు ఆగింది. 'శ్రీనూ నాన్న ఎవరు?' అడిగాడు కిందకు దిగిన కానిస్టేబుల్‌.
'నేనే సార్‌! ఏటైనాది నా శీనుకి?' అడిగాడు వణుకుతున్న గొంతుతో.
'మీ అబ్బాయి పతంగి కోసం ఎలక్ట్రిక్‌ పోల్‌ ఎక్కి షాక్‌ తగిలి, చనిపోయాడు. బాడీని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పంచనామా మీద నీ సంతకం కావాలి. జీప్‌ ఎక్కు!' అన్నారు.
వార్త వినగానే కాంతమ్మ కూలబడిపోయింది. పిచ్చి చూపులు చూస్తూ గుండెలవిసేలా ఏడుస్తోంది. ఆమెని ఓదార్చడం ఎవరివల్లా కావటం లేదు. ఆమె బాధ చూస్తే అక్కడున్న జనం గుండె తరుక్కుపోతోంది.
అచేతనంగా నడచుకుంటూ వెళ్ళి జీపులో కూర్చున్నాడు వెంకన్న. కంట్లో దుమ్ము కొట్టుకుంటూ జీపు వెళ్లిపోయింది. పేగుమీద తేరుకోలేని దెబ్బకొట్టి కొడుకు ఎగిరిపోయాడు. కదులుతున్న జీపు వెనుక కన్నప్రేమతో తల్లి పరుగెట్టింది. సూరీడు కంటే ముందు వెలిగిన భోగిమంట మండుతూనే ఉంది. తల్లి కడుపులో కార్చిచ్చు కాలుతూనే ఉంటుంది. తర్వాత పతంగి పోటీల్లో గెలిచినవాళ్లు పండగ చేసుకున్నారు. వెంకన్న నెమ్మదిగా మనసుని సమాధానపరచుకున్నాడు. కొన్నాళ్లపాటు స్పృహ లేకుండానే మంచం మీదే జీవితాన్ని ఈడ్చింది కాంతమ్మ. నిద్రలేని రాత్రులు గడిపింది. బతికున్నా జీవశ్చవంలానే ఉంది.
మిత్రులు ఇచ్చిన సలహాతో భార్యకి స్థానచలనం కొంతైనా మానసిక ప్రశాంతత కల్గిస్తుందని ఆశతో సొంత గ్రామానికి బయల్దేరాడు.
పక్కింటి పార్వతమ్మ తలుపు తట్టిన చప్పుడుకి వాస్తవంలోకి వచ్చింది కాంతమ్మ.


                                                                                        000

           ఆమె మాట్లాడుతోంది, ఆ మాటల్లో జీవం లేదు. నవ్వుతోంది, ఆ నవ్వులో స్వచ్ఛత లేదు. గుండె మాత్రం భోగిమంటలా కాలుతూనే ఉంది. తలపుల్లో కొడుకే. కలత నిద్రలో కొడుకు జ్ఞాపకాలే. అందలం ఎక్కిద్దామని అనుకున్న కొడుకు అందనంత దూరం వెళ్లిపోయాడు. వలస వెళ్ళిన జీవితం వెగటు జీవితంగా మారిపోయింది. ఏదో చేద్దామనుకుంటే బతుకు ఎడారిగా మారింది. సంక్రాంతి అందరికీ పండగే. కాంతమ్మకు మాత్రం భోగి మంట పేరు చెపితే గుండె భగభగలాడుతుంది.

పెమ్మరాజు విజయ రామచంద్ర
98497 44161