ప్రజాశక్తి-సాలూరు : మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్ దేవ్ నియోజకవర్గంలో టిడిపిని భ్రష్టుపట్టించా రంటూ పలువురు మండల నాయకులు అధినేత చంద్రబాబునాయుడుకు రాసిన లేఖ తెలుగు తమ్ముళ్లలో కలకలం రేపుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు నడుపుతూ పార్టీ ఎదగకుండా చేశారని ఆరోపించారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన నాయకులు సంతకాలు ఆ లేఖలో ఉన్నాయి. టిడిపి మక్కువ మండల ప్రధాన కార్యదర్శి బి.గౌరీశంకరరావు, పాచిపెంట మండల కార్యదర్శి జి.యుగంధర్, అరకు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షులు పి.మల్లేశ్వరరావు, జిల్లా అధికారప్రతినిధి అక్కేన తిరుపతిరావు, పాచిపెంట ఎంపిటిసి సభ్యులు పి.ఉమామహేశ్వరరావు, తెలుగు యువత పాచిపెంట మండల అధ్యక్షులు సిహెచ్.కనకారావు, మాజీ కౌన్సిలర్ డి.కృష్ణ, పట్టణ నాయకులు బి.సతీష్‌తోపాటు మరికొందరు కార్యకర్తల సంతకాలతో పార్టీ అధినేతకు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా గ్రూపుల్లో కలకలం రేపుతోంది. తాను తప్ప మరెవరూ నియోజకవర్గంలో ఆధిపత్యం వహించ కూడదని భావిస్తున్నారని, మండలాల్లో గ్రూపులను విడగొట్టారని పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సంధ్యారాణిని ఓడించేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భారీ మెజారిటీతో గెలవాల్సిన టిడిపి.. భంజ్‌దేవ్ వెన్నుపోటు కారణంగా 1500ఓట్ల తేడాతో ఓటమి పాలైందని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ముందు దొడ్డిదారిన ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రం సంపాదించి టిడిపి అభ్యర్థిగా భంజ్‌దేవ్ పోటీ చేశారని, ఆ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన నిధులను సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన భంజ్‌దేవ్ పార్టీ ఇచ్చిన నిధులు మిగిలించుకుని ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. పారమ్మకొండ భూముల్లో చేపల చెరువులు నిర్మించుకున్న భంజ్‌దేవ్ ఆ భూములను కాపాడుకునేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావుతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని లేఖలో ఘాటుగా ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.










