* చంద్రునిపై దిగిన చంద్రయాన్-3
* ఊరూవాడా వెల్లివిరిసిన ఆనందం
* జయహో భారత్ నినాదాలతో ప్రదర్శనలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం యంత్రాంగం: ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను అగ్రభాగాన నిలిపి... అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పిన శాస్త్రవేత్తలకు జయహో అంటూ ఊరూవాడ జేజేలు పలికింది. చందమామ అందిన రోజైన ఈ రోజు భలే మంచి రోజు... పసందైన రోజు అంటూ జనం మోము మురిసిపోయింది. జయహో భారత్... సాహో ఇస్రో అంటూ యువత కేరింతలు కొట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే జగమే వెన్నెలైంది... ఊయలలూగింది.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని జిల్లా ప్రజానీకం ఎంతో ఆసక్తిగా తిలకించింది. జాబిల్లిపై దిగే ఉత్కంఠ క్షణాలను చూసేందుకు టివిలు, సోషల్ మీడియాకు అతుక్కుపోయింది. జాబిల్లిపై చంద్రయాన్ అడుగుపెట్టి విజయగీతిక వీచిన క్షణాన ఆనందోత్సహాల్లో మునిగిపోయింది. పలు పాఠశాలలు, కళాశాలల్లో ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ కూడలిలోని వివేకానంద విగ్రహం వద్ద జాతీయ పతాకాలతో యువత సందడి చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రదర్శన చేపట్టారు. సూర్యమహల్ నుంచి జి.టి రోడ్డు మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకు పలు ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలతోపాటు ప్రజలు బాణాసంచా పేలుస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇస్రోకు మద్దతుగా జయహో చంద్రయాన్-3 పేరిట ర్యాలీ నిర్వహించారు. పాఠశాల సైన్స్ క్లబ్ ఆధ్వర్యాన సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.ఉమాకుమారి పర్యవేక్షణలో ఈ ప్రదర్శన సాగింది.
నందిగాం మండలంలోని దేవళభద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా చంద్రయాన్-3 అక్షర క్రమంలో రాళ్లని పేర్చి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.పూర్ణిమ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టెక్కలి మండలంలోని రావివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ప్రధానోపాధ్యాయులు డి.భారతి ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు విక్రమ్ అనే అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు.
పలాస మండలంలోని బ్రాహ్మణతర్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు రాళ్లతో చంద్రయాన్ అక్షరమాలను తయారు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల పాల్గొన్నారు.
కంచిలిలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకంతో మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు.
జి.సిగడాం మండల కేంద్రంలోని కెజిబివిలో ప్రిన్సిపాల్ ఉషారాణి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడంతో చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు వీక్షించారు.










