Jan 29,2023 23:18

  • అమరావతి బాలోత్సవంలో వేలాది మంది విద్యార్థుల ప్రదర్శనలు

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : అమరావతి బాలోత్సవం ఐదవ పిల్లల పండుగ ఆదివారం పొట్టిశ్రీరాముల చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్‌ కళాశాలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 31వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే అమరావతి బాలోత్సవంలో కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి 161 పాఠశాలలకు చెందిన 7,500 మంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతికాంశాలలో తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో మొదటి రోజు ఆదివారం రెండు వేల మంది విద్యార్థినీ విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆ ప్రాంతమంతా పిల్లలు, పెద్దలతో కోలాహలంగా కనిపించింది. ముఖ్యంగా ఏడు సంవత్సరాల వయస్సు గల చిన్నారి చెర్రి డ్రమ్స్‌ వాయించి అందరినీ అలంరించాడు. ప్రపంచస్థాయిలో నాల్గో స్థానం పొందిన ఈ బుడతడు డ్రమ్స్‌ వాయించడంతో పెద్దలతో పాటు ఆరి తేరిన వాడిగా తన హావభావాలను ప్రదర్శించాడు. జానపద గీతాలు ఆలపించిన వేదిక (సినీ నటి జమున వేదిక) ముందు అందరి కరతాళ ధ్వనులు అందుకున్నాడు. ఇదే వేదికపై జానపద గీతాలు అలరించాయి. అడవుల ఆవశ్యకత, కన్నతల్లి ప్రేమ, అడవి తల్లికి దండాలు అంటూ సాగిన నృత్య ప్రదర్శన అందరినీ అలరింపజేసింది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య వేదికపై ఏకపాత్రాభినయాలు, దేశభక్తి గేయాలు, మాయల పకీరు, బుడబుక్కలోడు, అల్లూరి సీతారామరాజు, దుర్యోధునిడి ఏకపాత్రాభినయం, దేశం కోసం రాజ్‌గురు, భగత్‌సింగ్‌ త్యాగాలు, పాలకుల విధానాల వల్ల నష్టపోతున్న రైతు, పురుగుల మందే శరణ్యమంటే ఆత్మహత్య చేసుకున్న వైనం వేదిక ముందు ఉన్న వారిని కంటతడి పెట్టించింది. డాక్టర్‌ హేమా హరిణి ప్రాంగణంలో వ్యర్థాల నుంచి ఆకర్షణీయమైన వస్తువులు ఎలా తయారు చేయవచ్చో బెస్ట్‌ ఫర్‌ వేస్ట్‌లో బుడతలు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. సినీనటుడు కృష్ణ పేరుతో ఏర్పాటు చేసిన వేదికపై లఘు నాటికలు అలరించాయి. ఆడపిల్లను చదవనిద్దాం...బతకనిద్దాం అనే సందేశంతో వేసిన నాటిక సభికులకు కంటతడి పెట్టించింది. యలవర్తి నాయుడమ్మ వేదికపై రేలా రేలా అంటు దుమ్ము రేగొట్టారు. సోలో నృత్యాలు, జానపద నృత్యాలు ప్రదర్శించి అలరించారు. ఈ వేదిక దగ్గర వందలాది మంది గంటల తరబడి కూర్చుని ఆసాంతం వీక్షించారు. పిఎస్‌ఎన్‌ పట్నాయక్‌ పేరుతో విద్యార్థులు మట్టిబొమ్మలు తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. నాట్యాచార్యులు శివశంకర్‌ మాస్టర్‌ ప్రాంగణం పేరుతో ఏర్పాటు చేసిన వేదికపై శాస్త్రీయ నృత్యం సీనియర్స్‌ విభాగం 50 మంది తమ అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కళాశాల,ప్రాంగణమంతా పిల్లలు, పెద్దలు సందడితో పండుగ వాతావరణం నెలకొంది ఐదో పిల్లల పండుగను తెలియజేస్తూ కళాశాల ప్రవేశ మార్గం కొత్తపేట రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం వీక్షకులను ఆకర్షించింది. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌లో జూనియర్‌, సీనియర్లకు పోటీలు నిర్వహించారు. సీనియర్లకు కార్టూన్‌ గీయటం, కవితా రచన, కథా రచన, వార్తా రచన, కథా విశ్లేషణ, అంతర్జాలంలో అన్వేషణ, దిపపత్రికా పఠనం పోటీలు నిర్వహించారు. సీనియర్స్‌ విభాగంలో జానపద నృత్యం, జానపద గీతాలాపన, ఏకపాత్రాభినయం, క్లాసికల్‌ డాన్స్‌, లఘు నాటికల్లో విద్యార్థులు తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. బాలోత్సవం తొలిరోజున ఆద్యంతం పిల్లల ఆనందోత్సాహాల మధ్య హుషారుగా సాగింది.
ఘనంగా బాలోత్సవం ప్రారంభం
ముందుగా జరిగిన ప్రారంభ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ జాతీయ పతాకాన్ని, అమరావతి బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు చలువాది మల్లిఖార్జునరావు బాలోత్సవం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాలోత్సవం అధ్యక్షులు ఎస్‌పి.రామరాజు అధ్యక్షతన జరిగిన సభలో చొక్కాపు వెంకటరమణ ప్రారంభోపన్యాసం చేశారు. ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు, కొత్తగూడెం బాలోత్సవం బాధ్యులు వాసిరెడ్డి రమేష్‌ బాబు, కమిటీ గౌరవాధ్యక్షులు చలువాది మల్లిఖార్జునరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, ఉపాధ్యక్షులు, మాజీ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు, గుమ్మా సాంబశివరావు, బి.సాంబిరెడ్డి, కార్యదర్శి జి. జోత్స్న, డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ఎపి గ్రంధాలయ సంస్థ మాజీ కార్యదర్శి రావి శారద, ఎం.కష్ణకుమారి, యార్లగడ్డ సుబ్బారావు, యువి.రామరాజు తదితరులు పాల్గొన్నారు.